Surekha Sikri: చిన్నారి పెళ్లికూతురు ఫేం సురేఖా క‌న్నుమూత‌

Surekha Sikri: క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తున్న‌ప్పటి నుండి ఎంతో మంది సినీ ప్ర‌ముఖులు మృత్యువాత ప‌డ్డారు. కొంద‌రు క‌రోనాతో క‌న్నుమూయ‌గా, మ‌రి కొంద‌రు ఇత‌ర అనారోగ్య స‌మ‌స్యల‌తో తుదిశ్వాస విడిచారు.వారి మ‌రణం ఎంతో మంది అభిమానుల‌కి తీర‌ని శోకాన్ని మిగిల్చింది. తాజాగా ‘చిన్నారి పెళ్లికూతురు’ బామ్మ సురేఖా సిక్రీ గుండెపోటుతో క‌న్నుమూసారు.

Surekha Sikri

బుల్లి తెర ప్రేక్షకులకు చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ లో కళ్యాణి దేవిగా పరిచయం అయిన సురేఖా త‌న‌ నటనతో తెలుగులో కూడా అభిమానులను సంపాదించుకున్నారు. సురేఖా వయస్సు 75 సంవత్సరాలు. కాగా, ఆమె మ‌ర‌ణాన్ని కుటుంబ సభ్యులు ధృవీకరించారు. సురేఖ సిక్రీ గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతూనే ఉన్నారు. 2018 లో పక్షవాతంతో.. 2020 లో బ్రెయిన్ స్ట్రోక్‌తో బాధపడ్డారు.

బ్రెయిన్ స్ట్రోక్‌ రావడంతో వెంటనే ముంబై లోని క్రిటికేర్ హాస్పిటల్‌కు తరలించారు. అప్పటికే ఆమె పరిస్థితి కాస్త విషమంగా ఉండటంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. అయితే అప్పుడు ఆమె కోలుకున్న‌ప్ప‌టికీ తాజాగా క‌న్నుమూసారు. సురేఖ మూడుసార్లు జాతీయ ఫిల్మ్ అవార్డుల‌ను గెలుచుకున్నారు. త‌మాస్‌, మ‌మ్మో, సాలిమ్ లంగ్డే పే మ‌త్ రో, జుబేదా, బాలికా వ‌ధు లాంటి సీరియ‌ళ్ల‌లో న‌టించారు. 2018లో రిలీజైన బ‌దాయి హో చిత్రంలో ఆమె హీరో ఆయుష్మాన్ ఖుర్హాన్‌కు నాన‌మ్మ పాత్ర‌లో న‌టించారు.

సురేఖా సిక్రీ 19 ఏప్రిల్ 1945న జన్మించారు.. 1978 లో కిస్సా కుర్సి కా చిత్రంతో తెరంగేట్రం చేశారు. బుల్లి తెరపై బాలికా వధూ సీరియల్ తో స్మాల్ స్క్రీన్ పై కూడా తన నటనతో అలరించారు. ఆయుష్మాన్ ఖుర్రానా నటించిన బధాయ్ హో లో సురేఖ సిక్రీ నటనకు విమర్శకుల ప్రశంసలు లభించాయి. సురేఖ హిందీ, మలయాళ చిత్రాల్లో సహాయక పాత్రల్లో నటించారు. హిందీ థియేటర్ కోసం చేసిన కృషికి 1989 లో సంగీత నాటక్ అకాడమీ అవార్డును గెలుచుకున్నారు. చివరగా ఆమె నెట్‌ఫ్లిక్స్ హారర్ ఆంథాలజీ ‘ఘోస్ట్ స్టోరీస్‌’లో జాన్వీ కపూర్‌తో కలిసి నటించింది. సురేఖా మృతిపై బాలీవుడ్ ప‌రిశ్ర‌మ సంతాపం ప్ర‌క‌టించింది.