Chandra Babu Naidu : గాంభీర్యంగా ఉండే చంద్ర‌బాబు క‌న్నీరు పెట్ట‌డానికి ఆ ఫోన్ కాల్ కార‌ణ‌మా?

Chandra Babu Naidu : ఎంతో గాంభీర్యంగా ఉండే చంద్ర‌బాబు కన్నీరు పెట్టుకోవ‌డం ఇప్పుడు అంతా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ప్రెస్‌మీట్‌లోనే వెక్కి, వెక్కి ఏడ్చారు.. పక్కనే ఉన్న టీడీపీ నేతలు ఓదార్చారు. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి టీడీపీ ఎమ్మెల్యేలు, నేతల్ని అవమానిస్తున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

Chandra Babu Naidu crying in press meet because of photo call
Chandra Babu Naidu crying in press meet because of photo call

తన భార్య భువనేశ్వరి ఇల్లు దాటి ఎప్పుడూ బయటకు రాలేదన్నారు. క్యారెక్టర్ అసానినేషన్ చేస్తున్నారని.. ఎప్పుడూ ఇలాంటి పరిస్థితులు చూడలేదన్నారు. తన భార్య ఏ రోజూ రాజకీయాల్లోకి రాలేదన్నారు.రాష్ట్రం కోసం, ప్రజల కోసం ఎంతో ఓర్పుగా ఉన్నానన్నారు చంద్రబాబు. తన జీవితంలో ఎప్పుడూ ఇలాంటి పరిణామాలు చూడలేదని.. ఇంత బాధ భరించలేదన్నారు. బూతులు తిట్టినా.. ఎన్ని అవమానాలకు గురి చేసినా భరించానన్నారు.

గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా అసెంబ్లీలో తన తల్లిని అవమానించారని.. తర్వాత తప్పు జరిగిందని క్షమాపణ కోరారన్నారు. ప్రజా క్షేత్రంలోనే పోరాడతానని.. తన ధర్మ పోరాటానికి ప్రజలు సహకరించాలన్నారు. మళ్లీ ప్రజల మద్దతుతో మళ్లీ అసెంబ్లీలో అడుగు పెడతానన్నారు.

గంభీరంగా ఉండే చంద్రబాబు ఆ స్థాయిలో విలపించడం వెనకున్న రీజనేంటి..? గట్టిగా పోరాడాలని కార్యకర్తలకు నూరిపోసే చంద్రబాబు ఎందుకు డీలా పడ్డారు..? టీడీఎల్పీ భేటీలో.. మీడియా ఎదుట భావోద్వేగాలను ఎందుకు కంట్రోల్‌ చేసుకోలేకపోయారనేది పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఏపీ అసెంబ్లీలో అనూహ్య పరిణామాల తర్వాత ఎన్నడూ లేని విధంగా టీడీపీ అధినేత చంద్రబాబు మీడియా ఎదుట భోరుమంటూ విలపించారు.

అంతకుముందు టీడీఎల్పీలోనూ దానికి రెండింతలు గుక్కపెట్టి కన్నీళ్లు పెట్టుకున్నట్టు సమాచారం. చంద్రబాబును ఆ పరిస్థితిలో గతంలో ఎన్నడూ చూడని పార్టీ సీనియర్లు, ఇతర నాయకులు షాక్‌ అయ్యారట. సభ నుంచి ఛాంబర్‌లోకి వచ్చి టీడీఎల్పీ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసిన ఐదు నిమిషాల వరకు ఆయన గంభీరంగానే ఉన్నారట. ఆ తర్వాత చంద్రబాబుకు వచ్చిన ఓ ఫోన్‌ కారణంగా.. అప్పటి వరకు అణిచిపెట్టుకుని ఉన్న కన్నీళ్లు కట్టలు తెంచుకున్నాయని అంటున్నారు పార్టీ ఎమ్మెల్యేలు.

తన ఛాంబర్లోని యాంటీ రూమ్‌లోకి వెళ్లిన చంద్రబాబు ఫోన్‌లో ఎవరితో సంభాషించారనే అంశంపై పార్టీ ఎమ్మెల్యేలు ఆరా తీశారట. ఆ ఫోన్ చేసింది చంద్రబాబు భార్య భువనేశ్వరీ అని తెలిసిందట. భార్యతో ఫోన్లో మాట్లాడిన తర్వాతే ఛాంబర్‌లోని తన ఛైర్‌లోకి వచ్చి కూర్చొని బోరు బోరుమంటూ ఏడ్చేశారట చంద్రబాబు. దీంతో ఆయన్ని ఎలా సముదాయించాలో తెలియక బిత్తరపోయారట ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.

తనను తాను కంట్రోల్‌ చేసుకోలేకపోతున్నానని.. మీడియా సమావేశం పెట్టలేనని పార్టీ నేతల వద్ద ప్రస్తావించారట. అయితే సభలో ప్రకటనకు అవకాశం దక్కలేనందున.. మీడియాతో మాట్లాడితేనే ప్రజలకు అర్థమయ్యేలా చెప్పగలమని ఎమ్మెల్యేలు బదులిచ్చారట. ఆ తర్వాతే ఆయన మీడియా ముందుకు వచ్చారని తెలుస్తోంది.