Bunny Vasu: సమ‌స్య‌ని ప్ర‌భుత్వం, పవ‌న్ దృష్టికి తీసుకెళ్ల‌గా సానుకూలంగా స‌మాధానం వ‌చ్చింది: బ‌న్నీ వాసు

Bunny Vasu: బ‌న్నీ వాసు.. ప్ర‌స్తుతం టాలీవుడ్ సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూస‌ర్స్‌లో ఒక‌రిగా మారారు. ఆయ‌న తాజాగా ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో పూజాహెగ్డే నాయిక కాగా, బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వం వహించారు. బన్నీ వాసు, వాసు వర్మ నిర్మాతలుగా వ్య‌వ‌హ‌రించారు. అల్లు అరవింద్‌ సమర్పిస్తున్న ఈ సినిమా అక్టోబరు 15న విడుదల కానుండ‌గా, మీడియాతో ప‌లు విష‌యాల గురించి మాట్లాడారు బ‌న్నీ వాసు.

Bunny Vasu Press Meet Details
Bunny Vasu Press Meet Details

పెళ్లైన తర్వాత కూడా పిల్లలకు ఏం నేర్పాలనేది సినిమా చూస్తే తెలుస్తుంది. అలాగని సందేశాలు ఇవ్వలేదు. ఏది చెప్పినా.. వినోదాత్మకంగానే చెప్పే ప్రయత్నం చేశాం. స్క్రిప్ట్‌ విషయంలో భాస్కర్‌ ఎక్కువ సమయం తీసుకుంటాడు. దర్శకుడిగా తనకు సంతృప్తి దొరికే వరకు కథపై కసరత్తులు చేస్తాడు. షూటింగ్‌ మాత్రం చాలా వేగంగా పూర్తిచేస్తాడు. ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’ 85 రోజుల్లోనే చిత్రీకరణ జరుపుకొంది.

ప్రస్తుతం మేమంతా గడ్డు పరిస్థితులనే ఎదుర్కొంటున్నాం. సినిమా విడుదల చేయడం ఆర్థికంగా రిస్క్‌తో కూడుకున్నది. కానీ ఇంకా ఆలస్యం చేస్తే మా సంస్థకి, అఖిల్‌కి నష్టమని నా అభిప్రాయం. మా బాధలన్నీ ప్రభుత్వానికి వివరించాం. వాళ్లు కూడా ఎప్పటికప్పుడు సంప్రదిస్తున్నారు. ఒక మాటైతే ఇచ్చారు. పవన్‌ కల్యాణ్‌ తను అనుకున్నది చెబుతున్నారు. ఆయన ఆవేదనలోని విషయాన్ని మంత్రికి వివరించాం. ప్రభుత్వం చెబుతున్నది కూడా పవన్‌కి చెప్పాం. ఈ సమస్యను మరింత జఠిలం చేయొద్దని ఇరు వర్గాలను కోరాం. ఇద్దరూ పాజిటివ్‌గానే స్పందించారు.

ప్రభుత్వం మొత్తంగా బుకింగ్‌ కౌంటర్‌ను ఎత్తేస్తుందని భావన ప్రజల్లోకి వెళ్లింది. కానీ అది వాస్తవం కాదు. మొత్తం ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తుందని కాదు.. కానీ అర్ధరాత్రి పన్నెండు లోపు ఎన్ని టికెట్లు బుక్‌ అయ్యాయి, ఎంత ఆదాయం వచ్చిందనే సమాచారం కోరుతుంది అంతే. తెలంగాణలో థియేటర్లన్ని ఒక క్రమపద్ధతిలో నడుస్తాయి. పన్ను కట్టడం చాలా మెరుగ్గా ఉంది. ఇక్కడున్న థియేటర్లు, మల్టీప్లెక్స్‌లు దాదాపు కార్పొరేట్‌ సంస్థలవే. పన్ను ఎగ్గొట్టడానికి అవకాశం లేదు.

అల్లు అర్జున్‌ని ఇంకొక స్థాయికి తీసుకెళ్లేలా ‘పుష్ప’ ఉంటుంది. తదుపరి చిత్రం ఏదనేది ఇంకా తెలియలేదు. ‘ఐకాన్‌’, బోయపాటి సినిమాల్లో ఏది ముందు మొదలవుతుందనే దానిపై స్పష్టత రాలేదు. మురుగదాస్‌తో అల్లుఅర్జున్‌ సినిమాపై చర్చలు నడుస్తున్నాయి అని బ‌న్నీ వాసు స్పష్టం చేశారు.