Bramaji: నారా లోకేష్‌ని ట్రోల్ చేసిన బ్ర‌హ్మాజీ.. ప్రేక్ష‌కులు న‌వ్వులే న‌వ్వులు

Bramaji: చంద్రబాబు నాయుడు త‌న‌యుడు నారా లోకేష్‌ని ప్ర‌తిప‌క్షాలు ఎంత‌గా విమ‌ర్శిస్తారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. కొన్ని సార్లు ఆయ‌న త‌న త‌ప్పుడు వ్యాఖ్య‌లు అనే ముద్ర కూడా వేయించుకున్నారు. చంద్ర‌బాబుకి ఉన్న వాక్‌చాతుర్యం లోకేష్‌కి లేద‌ని ఆయ‌న రాజకీయాల‌కు ప‌నికిరాడ‌ని చాలా మంది కామెంట్స్ చేశారు. అయిన‌ప్ప‌టికీ అవేమి ప‌ట్టించుకోకుండా నారా లోకేష్ ముందుకు సాగుతున్నాడు.

మొన్న‌టి వ‌ర‌కు రాజ‌కీయ నాయ‌కులే లోకేష్‌ని టార్గెట్ చేసేవాళ్లు. ఇప్పుడు సినిమా వాళ్లు కూడా కామెడీ కోసం ఆయ‌న డైలాగ్స్ వాడుకుంటున్నారు. తాజాగా స‌త్య‌దేవ్ నటించిన ‘తిమ్మరుసు’ చిత్రం థియేటర్స్‌లో విడులైంది. లాక్ డౌన్ ప్రభావంతో ప్రేక్షకులకు వినోదం కరువు కాగా, సెకండ్ వేవ్ త‌ర్వాత థియేట‌ర్స్‌లో విడుద‌లైన తొలి చిత్రం ఇదే. ఈ చిత్రం థియేట‌ర్స్ వ‌ద్ద పండుగ వాతావ‌ర‌ణం తీసుకొచ్చింది.

సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకెళుతుండ‌గా, మూవీ క్రైమ్ థ్రిల్ల‌ర్ నేప‌థ్యంలో తెర‌కెక్కి ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తుంది. అయితే ఈ చిత్రంలో కామెడీ స‌న్నివేశాలు కూడా ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్నాయి. బ్రహ్మాజీ పాత్ర ద్వారా పూర్తి స్థాయిలో వినోదాన్ని పండించారు. సుధాకర్ పాత్రలో బ్రహ్మాజీ కామెడీ పండించారు. అతని ప్రతి పంచ్‌కి థియేటర్స్‌లో రెస్పాన్స్ అదిరిపోయింది. ఓ సందర్భంలో హీరోతో పాటు కొబ్బరి బొండం తాగుతూ.. ‘తియ్యగుందీ’ అంటాడు. ఆ డైలాగ్‌కి థియేటర్స్‌లో ఓ రేంజ్ రెస్పాన్స్ వచ్చింది.

గత ఎన్నికల టైంలో గతంలో మంగళగిరి పర్యటనలో ఓ పెద్దావిడ మజ్జిగ ఇవ్వగా.. దాన్ని తాగుతూ.. ‘ఏం వేశావు ఇందులో.. చక్కెరా.. ‘తియ్యగుందీ’ అంటూ తనదైన స్టైల్లో అన్నారు లోకేష్ బాబు. దీంతో పంచదార వేస్తే తియ్యగా ఉండకపోతే ఉప్పగా ఉంటుందా? అని లోకేష్‌ని ఓ రేంజ్‌లో ట్రోల్ చేశాయి వైసీపీ వర్గాలు. తియ్య‌గుందీ డైలాగ్ అప్ప‌ట్లో పాపుల‌ర్ కావ‌డంతో ఇప్పుడు అదే ప‌దాన్ని సినిమాలో కూడా పెట్టిన‌ట్టు తెలుస్తుంది. రామ్ గోపాల్ వర్మ ‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’ సినిమాలో ను లోకేష్‌కి చెందిన ఇలాంటి డైలాగ్స్ పెట్టేసి ఓ రేంజ్‌లో ఆడుకున్న విష‌యం తెలిసిందే.