CARONA: సెల‌బ్రిటీల‌పై ప‌గ‌బ‌ట్టిన క‌రోనా .. మ‌రో బాలీవుడ్ న‌టుడు మృతి

ప్రఖ్యాత టెలివిజన్, సినీ నటుడు బిక్రామ్‌జీత్ కన్వర్‌పాల్ శుక్రవారం కోవిడ్ -19 సమస్యల కారణంగా తుది శ్వాస విడిచారు. 52 ఏళ్ల వ‌య‌స్సులో ఈ న‌టుడు అకాల మ‌ర‌ణం చెందడం అభిమానులు, సెల‌బ్రిటీల‌కు దిగ్భ్రాంతిని క‌లిగించింది.అనేక సినిమాలు, టీవీ షోల‌లో ప్ర‌ముఖ పాత్ర‌లు పోషించిన బిక్రామ్‌జీత్ రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్. ఈ విష‌యం చాలా మందికి తెలియ‌దు. 2003లో బాలీవుడ్ ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన బిక్రామ్జీత్ .. పేజ్ 3, ఆర‌క్ష‌ణ్‌, ప్రేమ ర‌త‌న్ ధ‌న్ పాయో, జ‌బ్ త‌క్ హై జాన్, 2 స్టేట్స్ వంటి హిట్ చిత్రాల‌లో ముఖ్య పాత్ర‌లు పోషించారు.

రానా- తాప్సీ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్కిన ది ఘాజీ అటాక్ అనే చిత్రంలో క‌నిపించిన ఈ న‌టుడు 2020లో వ‌చ్చిన మ‌ద అనే తెలుగు చిత్రంలో క‌నిపించాడు. కోవిడ్ వ‌ల‌న శుక్ర‌వారం బిక్రామ్‌జీత్ క‌న్నుమూయగా, ఆయ‌న మృతి తీరని విషాదాన్ని మిగిల్చింది. నీల్ నితిన్ ముఖేష్‌, ఫిలిం మేక‌ర్ అశోక్ పండింట్ వంటి ప్ర‌ముఖులు ఆయ‌న మృతికి సంతాపాన్ని తెలియ‌జేశారు.కుటుంబానికి ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేశారు.

Advertisement