బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం కరోనా టైంలోను ఎంత సజావుగా సాగుతుంది. నిర్వాహకులు ఇంటి సభ్యులని 14 రోజులు క్వారంటైన్లో ఉంచి ఆ తర్వాత నెగెటివ్ రిపోర్ట్ వచ్చాకే హౌజ్‌లోకి పంపారు. ప్రతి విషయంలోను కరోనా నిబంధనలు పాటిస్తూ షో జరుపుతుండగా, ఈ కార్యక్రమం సోమవారం నుండి శుక్రవారం వరకు రాత్రి 9.30ని.లకు ప్రసారం అవుతూ వస్తుంది. శని, ఆది వారాలలో మాత్రం 9గం.లకు ప్రసారం చేస్తున్నారు. అయితే ఇక నుండి సోమవారం నుండి శుక్రవారం వరకు ఈ షో ప్రసారం అయ్యే టైం మరో అరగంట ముందుకు వెళుతుంది.

డిసెంబర్ 7 నుండి స్టార్ మా ఛానెల్లో గుప్పెడంత మనసు అనే సీరియల్ ప్రారంభం కానుంది. దీని కోసం బిగ్ బాస్ షోని ముందుకు జరిపారు. గుప్పెడంత మనసు సీరియల్ రాత్రి ఏడు గంటలకు ప్రసారం కానుండగా, ఆ సమయంలో ప్రసారమయ్యే వదినమ్మ సీరియల్‌ను రాత్రి 9.30నిలకు టెలికాస్ట్ చేయబోతున్నారు. దీంతో బిగ్ బాస్ షో పది గంటలకు ప్రసారం కానుంది. ఈ షో ఇప్పటికే 12 వారాలు పూర్తి చేసుకోగా, మరో మూడు వారాలు మాత్రమే మిగిలి ఉంది. అయితే ఇప్పటికే ఎంతో మంది అబిమానులని సంపాదించుకున్న కారణంగా షో టైమింగ్ మార్చిన పెద్ద ఫరక్ ఉండదనే భావనలో నిర్వాహకులు ఉన్నారట
నాగార్జున హోస్ట్‌గా 19 మంది సభ్యులతో మొదలైన ఈ షోలో ప్రస్తుతం ఏడుగురు సభ్యులు ఉన్నారు. ఈ వారం ఒకరు మరోవారం ఇంకొకరు ఎలిమినేట్ కానున్నారు. అంటే చివరి వారంలో ఐదుగురు మిగులుతారు. వారి విన్నర్, రన్నర్‌ని అనౌన్స్ చేస్తారు. డిసెంబర్ 20న గ్రాండ్ ఫినాలే ఉంటుందని తెలుస్తుండగా, ఈ సారి గెస్ట్‌గా ఎవరిని తీసుకొస్తారనే ఆసక్తి అందరిలో నెలకొంది. గత సీజన్లో మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్‌గా హాజరై రాహుల్‌కి ట్రోఫీ అందించిన విషయం తెలిసిందే.