Kaushal: ఈ ‘మంద’.. చెప్పిన మాట వింటేనా?.. బిగ్ బాస్ విన్నర్ కౌషల్ కరోనా సాంగ్..

Kaushal కౌషల్ మంద.. తెలుగు బిగ్ బాస్ రియాలిటీ షో సీజన్-2 విన్నర్. బుల్లి తెర, వెండి తెర నటుడు. వ్యాపారవేత్త. మోడల్. ఫ్యాషన్ కొరియోగ్రాఫర్. సెలెబ్రిటీ. బిగ్ బాస్ షోలో అతని ఒరిజినల్ క్యారక్టరేంటో చూశాం కదా. ఎదుటివాళ్లకు నచ్చినా నచ్చకపోయినా ఉన్నది ఉన్నట్లు మాట్లాడతాడు. అదే క్రమంలో తాజాగా కొవిడ్ వైరస్ సెకండ్ వేవ్ పై స్పందించాడు. తాను నటించిన ‘లెట్స్ ఫైట్ కరోనా’ అనే ఇన్ స్పిరేషనల్ మెసేజ్ ఓరియెంటెడ్ సాంగ్ ని నిన్న బుధవారం విడుదల చేశాడు. ‘‘కొవిడ్ ని వ్యాప్తి చేయకండి. అన్ని జాగ్రత్తలు తీసుకోండి. ప్రభుత్వం, వైద్య సిబ్బంది చెప్పే సూచనలను సలహాలను పాటిస్తూ మీరు సేఫ్ గా ఉండండి. ఇతరులూ సురక్షితంగా ఉండేలా చూడండి’’ అంటూ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాడు.

ఆకట్టుకోని పాట..

కౌషల్ మంద రిలీజ్ చేసిన ‘కరోనా ఈజ్ స్టిల్ అలైవ్’ అనే వీడియో సాంగ్ చూడటానికి బాగానే ఉంది కానీ వినటానికి అంత బాగేం లేదు. ప్రస్తుతం బయట నెలకొన్న పరిస్థితులకు మాత్రం చక్కగా అద్దం పడుతోంది. 5 నిమిషాల 6 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో 2 నిమిషాల 20 సెకన్లు మాత్రమే పాట ఉంది. మిగతా 2 నిమిషాలు కౌషల్ స్పీచ్ ఉంది. గత ఏడాది కాలంగా ప్రజలు కరోనాను లైట్ తీసుకోవటం వల్లే ఇప్పుడు ఈ దుస్థితి ఏర్పడిందని ఆయన అభిప్రాయపడ్డాడు. ఇప్పటికైనా జనం కేర్ ఫుల్ గా ఉండాలని రిక్వెస్ట్ చేశాడు.

ఇష్టం వచ్చినట్లు..

కరోనా విషయంలో కళ్లు మూసుకొని ఉండకండి అంటూ గడచిన ఏడాది కాలంగా ఎంతో మంది వీడియోలు, పాటల రూపంలో చెబుతున్నా ఎవరూ పట్టించుకోలేదని కౌషల్ మంద ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రజలు ఇష్టం వచ్చినట్లు బయట తిరిగారని, పార్టీలకు, ఫంక్షన్లకు పట్టపగ్గాల్లేకుండా హాజరయ్యారని తప్పుపట్టాడు. దీనివల్లే కొవిడ్-19 అందరికీ అంటుకుందని, ఫలితంగా అధిక మరణాలు చోటుచేసుకుంటున్నాయని తెలిపాడు. ఈ నేపథ్యంలో ఇంకొన్ని రోజుల పాటు బయటకు రావొద్దని, ఇంట్లోనే జాగ్రత్తగా ఉండాలని, దయచేసి తన మాట వినాలని కౌషల్ మంద వేడుకున్నాడు. కరోనా మహమ్మారి నియంత్రణకు ఒక సెలెబ్రిటీగా కౌషల్ మంద చేసిన ప్రయత్నాన్ని స్వాగతించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Advertisement