Bigg Boss Telugu 5: బిగ్ బాస్ నుండి తొలి వారం ఎలిమినేట్ కానున్న కంటెస్టెంట్ ఎవ‌రో తెలుసా?

Bigg Boss Telugu 5: కొన్నాళ్ల నుండి అంద‌రు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తూ వ‌చ్చిన బిగ్ బాస్ సీజ‌న్ 5 ఎట్ట‌కేల‌కు సెప్టెంబ‌ర్ 5న మొద‌లైంది. 19 మంది కంటెస్టెంట్స్ షోలో పాల్గొన‌గా, వీరిలో ఒక‌రు ఆదివారం బ‌య‌ట‌కు వెళ్ల‌నున్నారు. ఫస్ట్‌ వీక్‌ జరిగిన నామినేషన్‌ ప్రక్రియలో జెస్సీ(జస్వంత్‌), రవి, సరయూ, కాజల్‌, మానస్‌, హమీదా ఉన్నారు. తొలివారం, తొలి ఎలిమినేషన్‌ ఎవరు అనేది ఆసక్తిగా మారింది.

న‌చ్చిన కంటెస్టెంట్స్‌కి ప్రేక్ష‌కుల‌కి భారీగా ఓట్స్ వేస్తుండ‌గా, అంద‌రి కన్నా త‌క్కువ‌గా మోడల్‌ జెస్సీ(జస్వంత్‌)కు వ‌చ్చిన‌ట్టు తెలుస్తుంది. సీజ‌న్ 5 నుండి ఎలిమినేట్ కానున్న తొలి కంటెస్టెంట్ జెస్సీనే అంటూ సోష‌ల్ మీడియాలో జోరుగా ప్ర‌చారం న‌డుస్తుంది. మోడలింగ్‌ బ్యాక్‌గ్రౌండ్‌ నుంచి హౌజ్‌లో అడుగు పెట్టిన జెస్సీ తొలుత అమాయకంగా వ్యవహరించాడు. నామినేషన్‌ ప్రక్రియలో ఏడ్చి సింపతి కొట్టేశాడు.

కౌశ‌ల్ కూడా ఆయ‌న‌కు ధైర్యాన్ని అందించాడు. ఏడిస్తే హౌజ్ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చే తొలి కంటెస్టెంట్ నువ్వే అని సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేశాడు కౌశ‌ల్ అన్న‌ట్టుగానే ఈ సీజ‌న్ ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ జెస్సీ అని తెలుస్తుంది. అందుకు కార‌ణం ఆయ‌న ప్ర‌వ‌ర్త‌న అనే చెప్పాలి. రీసెంట్ ఎపిసోడ్‌లో అనీ మాస్ట‌ర్‌ని కూర్చోనివ్వ‌కుండా కాలు అడ్డుగా పెట్టి దురుసుగా ప్రవర్తించడంతో ఆమె లెఫ్ట్ అండ్ రైట్ క్లాస్ పీకింది. ఈ విషయంలో తప్పు జెస్సీదే అని అందరూ అనడంతో క్ష‌మాప‌ణ‌లు కూడా కోరాడు.

జెస్సీ మిగతా వారితో కూడా అలానే ప్ర‌వ‌ర్తించాడు.ఈ వారం ఆయ‌న త‌ప్ప‌క ఎలిమినేట్ అవుతాడ‌ని ప్ర‌చారం న‌డుస్తుంది. మ‌రి అస‌లు విష‌యం తెలియాలంటే ఆదివారం వ‌ర‌కు ఆగాల్సిందే. గ‌త సీజ‌న్స్‌లో మోడ‌లింగ్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వ‌చ్చిన కౌశ‌ల్‌, అలీ రెజా రాణించగా.. కౌశల్‌ అయితే ఏకంగా విన్నర్‌గా నిలిచాడు