BalaKrishna: మా బిల్డింగ్ ఇష్యూపై నంద‌మూరి బాల‌కృష్ణ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

BalaKrishna: మా(మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) ఎన్నికల నోటిఫికేష‌న్ ఇంకా విడుద‌ల కాలేదు కాని దీనిపై జ‌రుగుతున్న చ‌ర్చ‌లు అన్నీ ఇన్నీ కావు. సెప్టెంబ‌ర్ నెల‌లో జ‌ర‌గ‌నున్న మా అధ్య‌క్ష ఎన్నిక‌ల‌లో ప్ర‌కాశ్‌రాజ్, మంచు విష్ణు,జీవిత‌, హేమ‌, న‌ర‌సింహారావు పోటీ చేయ‌నున్న‌ట్టు ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. కొంద‌రు ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌ల‌కు కూడా చేసుకున్నారు. కొంద‌రు మా బిల్డింగ్ క‌ట్టిస్తామంటూ వాగ్ధానాలు కూడా చేశారు.

ప్ర‌కాశ్‌రాజ్ తాను గెలిస్తే మా బిల్డింగ్ క‌ట్టిస్తానంటూ వ్యాఖ్య‌లు చేయ‌గా,మంచు విష్ణు తాను సొంత ఖ‌ర్చుల‌తో మా భ‌వ‌నాన్ని నిర్మిస్తాన‌ని చెప్పుకొచ్చాడు. తాజాగా మా భ‌వ‌నంకు సంబంధించిన అంశంపై నంద‌మూరి బాల‌కృష్ణ స్పందించారు.ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో మాట్లాడిన బాల‌య్య‌.. ‘మా’ ఎన్నికల విషయంలో లోకల్, నాన్ లోకల్ గురించి నేను పట్టించుకోనని ఆయన అన్నారు. ఇంతకాలం ‘మా’ బిల్డింగ్ ఎందుకు కట్టలేకపోయారని ప్రశ్నించారు.

తెలంగాణ సర్కార్‌తో రాసుకుపూసుకు తిరుగుతున్నారు కదా.. ‘మా’ బిల్డింగ్ కోసం అడిగితే ఒక ఎకరం ఇవ్వరా ? అని బాలకృష్ణ కామెంట్ చేశారు. ఇక ఫండ్ రైజింగ్ కోసం ఫ‌స్ట్ క్లాస్ టికెట్స్‌తో అమెరికాకు తిరిగారు క‌దా, ఆ డ‌బ్బంతా ఏం చేశారు అని ప్ర‌శ్నించారు. మా శాశ్వ‌త భ‌వనాన్నిఇంత‌కాలం ఎందుకు నిర్మించ‌లేక‌పోయారని ప్ర‌శ్నించిన బాల‌య్య‌.. విష్ణు ముందుకొస్తే తాను కూడా ఇందుకు సహకరిస్తానని అన్నారు. అందరం కలిసి నిర్మిస్తే.. ఇంద్రభవనమే నిర్మించవచ్చని బాలకృష్ణ వ్యాఖ్యానించారు.

సినీ రంగం గ్లామర్ ఇండస్ట్రీ అని వ్యాఖ్యానించిన బాలకృష్ణ… సమస్యలు బహిరంగంగా చర్చించడం సరికాదని అన్నారు. ‘మా’ ఎన్నికల కోసం ఇంత రగడ జరగడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ఎన్నికలను జాతీయస్థాయి ఎన్నికల అన్నట్టుగా చూస్తున్నారని అన్నారు. ప్ర‌స్తుతం బాల‌కృష్ణ అఖండ సినిమాతో బిజీగా ఉన్న‌విష‌యం తెలిసిందే.

బోయ‌పాటి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన అఖండ చిత్రం ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. సింహా,లెజెండ్ చిత్రాల త‌ర్వాత ఈ ఇద్ద‌రి కాంబినేష‌న్‌లో రానున్న సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. వీలైనంత త్వ‌ర‌గా సినిమాను విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నారు.