Balakrishna: గాయ‌కుడిగా మారుతున్న సీనియ‌ర్ స్టార్ హీరో..!

Balakrishna: నందమూరి తారకరామారావు.. ఈ పేరే ఓ మంత్రం.. ఆయన నటనే మహనీయం.. సినిమాల్లోనైనా, రాజకీయాల్లోనైనా తనదంటూ ఓ ప్రత్యేకమైన శైలి. అప్పటివరకు సినీ ఇండస్ట్రీలో ఏ నటుడు సాధించని ఘనతను ఎన్టీఆర్ సాధించారు. ఎలాంటి పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేసి అభిమానుల్ని సొంతం చేసుకున్నారు. అలాగే ఆయన నటవారసుడు నందమూరి బాలకృష్ణ నటనాభినయం కూడా ప్రత్యేకం. ఎన్నో పౌరాణిక పాత్రలు చేయడంలో, పద్యాలు, శ్లోకాలు చెప్పడంలో బాలకృష్ణకు పెట్టింది పేరు. అలాగే తండ్రి ఎన్టీఆర్ తో కలిసి పలు సినిమాల్లో తెరను పంచుకున్నారు. అలాగే ఎన్టీఆర్ జయంతి సందర్భంగా గతేడాది బాలకృష్ణ ఓ పాటను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. శివ శంకరి శివానంద లహరి అనే పాటను పాడారు. అలాగే ఇటీవల ఎన్టీఆర్ జయంతి నాడు శ్రీ రామ దండకంను బాలకృష్ణ పాడి వినిపించారు. ఈ రెండు పాటలకు అభిమానుల దగ్గర్నుండి మంచి స్పందన లభించింది.

Balakrishna
ఎన్టీఆర్ సినిమాల్లో ఎంతో కష్టమైన పాటల్ని పాడి వినిపించి ప్రేక్షకులను మెప్పించడం సాధారణ విషయం కాదంటూ.. అలాంటిది తన తండ్రి మీద అభిమానాన్ని ఇలా ప్రదర్శిస్తున్నారంటూ మెచ్చుకున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు బాలకృష్ణ, ఎన్టీఆర్ సినిమాల్లోని మరో పాటను పాడి వినిపించబోతున్నట్లు తెలుస్తుంది. అయితే ఏ పాటను సెలెక్ట్ చేసుకుంటున్నారు.. ఏ సందర్భానికి సెలెక్ట్ చేసుకుంటున్నారనే విషయం మాత్రం ఇంకా ప్రస్తావించలేదు. అయితే చాలా కష్టతరమైన పాటనే పాడి వినిపించడానికి సిధ్ధంగా ఉన్నట్లు అర్థమవుతుంది. పదాలు, పద్యాలు పలకలేని విధంగా ఉండే అతి కష్టమైన, అర్థవంతమైన పాటను ఎంపిక చేసుకున్నారట.

బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్న అఖండ సినిమా షెడ్యూల్ పూర్తి అయ్యింది. అయితే మరికొన్ని పోస్ట్ ప్రొడక్షన్ పనులతో పాటు సినిమాకి ఫైనల్ మెరుగులు దిద్దాల్సి ఉంది. అలాగే కరోనా లాక్ డౌన్ కారణంగా సినిమాలు వాయిదా పడుతున్న నేపథ్యంలో అఖండ సినిమాను వాయిదా వేశారు. విడుదల తేదిని త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. ఈ సినిమా తర్వాత ప్రముఖ దర్శకుడు గోపిచంద్ మలినేని డైరెక్షన్ లో కూడా బాలయ్య బాబు నటిస్తున్నారు. ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్ కరోనా లాక్ డౌన్ తర్వాత మొదలవుతుందని సినీ వర్గాలు పేర్కోన్నాయి