Balakrishna New Movie Title: అలాంటి మాస్ టైటిల్ బాల‌య్య సినిమాకా.. అభిమానుల రియాక్ష‌న్ ఏంటి?

Balakrishna New Movie Title: నంద‌మూరి బాల‌కృష్ణ కుర్ర‌హీరోల‌తో పోటీ ప‌డీ సినిమాలు చేస్తున్నారు. ఆయ‌న బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ’ సినిమా షూటింగ్‌కు రీసెంట్‌గా గుమ్మడికాయ కొట్టేసిన సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ నటిస్తోంది. మరోవైపు శ్రీకాంత్ ఈ సినిమాలో విలన్ పాత్రలో నటిస్తున్నారు. జగపతి బాబు మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే అఘోరాగా బాలయ్య గెటప్‌‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

న‌వంబ‌ర్‌లో చిత్రాన్ని విడుద‌ల చేయ‌నుండ‌గా త్వ‌ర‌లో మ‌రో సినిమా షూటింగ్‌తో బిజీ కానున్నారు బాల‌కృష్ణ‌. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ చేయనుండగా, ఈ సినిమా కోసం ఇప్పటికే పలు టైటిల్స్ ప్రచారంలోకి వచ్చాయి. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ టైటిల్ ఫిల్మ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాకు పవర్‌ఫుల్ టైటిల్‌ను ఫిల్మ్ ఛాంబర్‌లో రిజిస్టర్ చేయించారట.

నందమూరి అందగాడు నట సింహా బాలకృష్ణ సినిమా అంటేనే పవర్‌ఫుల్ టైటిల్ ఉండాల్సిందే. త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న బాలయ్య, గోపీచంద్ మలినేని సినిమాకు కూడా ఓ పవర్‌ఫుల్ టైటిల్ అనుకుంటున్నారు. ముందుగా ఈ సినిమాకు ‘రౌడీయిజం’ అనే టైటిల్‌ను పెడుతున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ టైటిల్ పై జరుగుతున్న ప్రచారాన్ని మైత్రీ మూవీ మేకర్స్ వాళ్లు ఖండించిన సంగతి తెలిసిందే కదా.

ప్రస్తుతం మైత్రీ మూవీ మేకర్స్ పలువురు హీరోలతో వరుసగా సినిమాలు నిర్మిస్తున్నారు. ఈ కోవలో బాలకృష్ణ సినిమా కోసం ‘జై బాలయ్య’ అనే టైటిల్ రిజిస్టర్ చేయించినట్టు సమాచారం. ఇక అభిమానులు కూడా జై బాలయ్య అంటూ తమ అభిమాన హీరోను ముద్దుగా పిలుస్తుంటారు. ఇపుడు అదే టైటిల్‌ను ఈ సినిమాకు ఫిక్స్ చేస్తే.. ఈ సినిమాకు మరింత హైప్ క్రియేట్ కావడం పక్కా అని చెప్పొచ్చు. అంతేకాదు త్వరలో ఈ టైటిల్‌ను కూడా అఫీషియల్‌గా ప్రకటించనున్నట్టు సమాచారం.