Kathi Mahesh: కతి మ‌హేష్ మృతిపై అనుమానాలు.. విచార‌ణ‌కు ఆదేశించిన ఏపీ ప్ర‌భుత్వం

Kathi Mahesh: సినీ క్రిటిక్, క‌త్తి మ‌హేష్ ఇటీవ‌ల రోడ్డు ప్ర‌మాదంలో మ‌ర‌ణించిన సంగ‌తి తెలిసిందే. త‌న సొంత ఊరు నుండి హైద‌రాబాద్‌కు వెళుతున్న స‌మ‌యంలో మ‌హేష్‌కు తీవ్ర గాయాలు కావడంతో క‌న్నుమూసాడు. ఆయన మృతిపై ప‌లువురు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. తాజ‌గా మంద‌కృష్ణ మాదిగ కూడా మ‌హేష్ మృతిపై అనుమానాలు వెళ్ల‌బుచ్చారు.

సోమవారం చిత్తూరు జిల్లాలోని మహేశ్ స్వగ్రామంలో జరిగిన అంత్యక్రియల్లో పాల్గొన్న ఎమ్మార్పీఎస్ అధినేత మంద కృష్ణ మాదిగ మ‌హేష్ మ‌ర‌ణంపై ప‌లు సందేహాలు వెళ్ల‌బుచ్చారు. మ‌హేష్ కారు ప్ర‌మాదం అనుమానాస్పందంగా ఉంద‌ని చెప్పిన ఆయ‌న రోడ్డు ప్రమాదంలో కారు కుడిభాగం పూర్తిగా నుజ్జునుజ్జు అయినప్పటికీ డ్రైవర్ సురేశ్‌ స్వల్పగాయాలతో బయటపడటం, ఎడమ వైపు కూర్చున్న మహేశ్‌కు తీవ్రంగా గాయపడటం అనేక సందేహాల‌ను క‌లిగిస్తున్న‌ద‌ని చెప్పుకొచ్చారు.

కత్తి మహేశ్‌కు చాలామంది శత్రువులున్నారని.. గతంలోనూ ఆయనపై అనేక దాడులు జరిగాయని మంద కృష్ణ మాదిగ గుర్తుచేశారు. ఈ ఉదంతంపై లోతుగా దర్యాప్తు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరారు. కత్తి మహేశ్ మరణంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ క్ర‌మంలో కత్తి మహేశ్ మరణంపై విచారణకు ఆదేశించింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మహేశ్ కారు డ్రైవర్ సురేష్‌ను విచారణకు పిలిచారు.

పోలీసులు క‌త్తి మ‌హేష్ డ్రైవ‌ర్ ను విచారించగా, ప్ర‌మాద స‌మ‌యంలో త‌న‌కు సీటు బెల్ట్ ఉంద‌ని… క‌త్తి మ‌హేష్ సీటు బెల్ట్ పెట్టుకోక‌పోవ‌టంతోనే గాయాలు ఎక్కువ‌య్యాయ‌ని పోలీసుల‌కు డ్రైవ‌ర్ తెలిపిన‌ట్లు తెలుస్తోంది. అయితే కత్తి మహేష్‌ మృతిపై తమకూ అనుమానాలున్నాయని ఆయన తండ్రి ఓబులేషు పేర్కొన్నారు. మహేష్ చనిపోయిన విషయాన్ని తమకంటే ముందే బయటకు చెప్పారని ఆయన తెలిపారు.

క‌త్తి మ‌హేష్ మృతిపై అనేక విచార‌ణ‌లు జ‌రిపించి మాకు న్యాయ జ‌రిగేలా చూడాల‌ని కుటుంబ స‌భ్యులు కోరుతున్నారు. కాగా, ఆసుప‌త్రిలో ఉన్న స‌మ‌యంలోను ప‌లు అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. ప్రాణాపాయం లేద‌ని చెప్పిన వైద్యులు ఆయ‌న చనిపోయాడు అనే స‌రికి అనేక సందేహాలు వ్యక్త‌మ‌వుతున్నాయి. కావాల‌నే ఆక్సిజ‌న్ తీసేసారంటూ ప్ర‌చారం చేస్తున్నారు.