VIRAT KOHLI: విరాట్ దంప‌తుల పిలుపుకు భారీ స్పంద‌న‌.. ఏడు రోజుల‌లో 11.39 కోట్ల ఫండ్

కరోనా విజృంభిస్తున్న నేప‌థ్యంలో సెల‌బ్రిటీలు సామాన్యుల‌కు సాయం చేసేందుకు ముందుకు వ‌స్తున్నారు. విరాట్ కోహ్లీ దంప‌తులు ‘ఇన్ దిస్ టుగెదర్’ పేరుతో ఫండ్ రైజింగ్ కార్యక్రమాన్ని చేప‌ట్టి ముందుగా వారు రెండు కోట్లు అందించారు. ఈ ఫండ్ వారం రోజుల‌లో 7 కోట్లు కావాల‌ని టార్గెట్ పెట్టుకున్నారు. కాని ఐదు రోజుల‌లోనే ఆ టార్గెట్ అందుకుంది. ఇక టార్గెట్‌ని రూ. 11 కోట్ల‌కు పెంచ‌గా, వారం రోజుల‌లో ‘ఇన్ దిస్ టుగెదర్’కి రూ.11,39,11,820 ఫండ్ వచ్చినట్లు విరాట్ దంప‌తులు పేర్కొన్నారు. ఈ మొత్తాన్ని కరోనా రోగుల అవసరాలు తీరుస్తున్న యాక్ట్ గ్రాంట్స్‌ అసోషియేషన్‌కి ఇవ్వాలని ముందుగానే విరుష్క జోడీ నిర్ణయించిన విష‌యం విదిత‌మే.

అయితే త‌మ పిలుపుకు ప్ర‌తి ఒక్క‌రు స్పందించి త‌మ‌కు తోచినంత సాయం అందించినందుకు విరాట్ జోడీ ప్ర‌తి ఒక్క‌రికి కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేసింది. కాగా, జూన్ 2న ఇంగ్లాండ్ గడ్డపైకి వెళ్లనున్న టీమిండియా.. అక్కడ న్యూజిలాండ్‌తో జూన్ 18 నుంచి 23 వరకూ ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఆడ‌నున్న సంగ‌తి తెలిసిందే. దీని కోసం కోహ్లీ కొద్ది రోజుల ముందే అక్క‌డికి వెళ్ల‌నున్నాడు. ఆగస్టు 4 నుంచి సెప్టెంబరు 10 వరకూ ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్ కూడా ఆడ‌నున్నారు.