Pawan Kalyan: పవన్ కళ్యాణ్ నన్ను మెచ్చుకున్నంతగా ఎవరినీ మెచ్చుకోలేదు: అంజలి

Pawan Kalyan ‘వకీల్ సాబ్’ కోసం నన్ను మొదట డైరెక్టర్ వేణు గారు అప్రోచ్ అయ్యారు. ఇది హిందీలో వచ్చిన ‘పింక్’ మూవీకి రీమేక్ కదా. దాన్ని మేము తెలుగులోకి జస్ట్ కాపీ పేస్ట్ చేయట్లేదని, ఇక్కడి ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా పూర్తిగా మార్చేస్తున్నామని ఆయన చెప్పటం నచ్చింది. స్క్రిప్ట్ కూడా వినిపించారు. నా రోల్ నాకు చాలా బాగా నచ్చింది. అందుకే ఒప్పుకున్నా. నేను హిందీ ‘పింక్’ చూశా. అందులోని నా క్యారెక్టర్ కి, ‘వకీల్ సాబ్’లోని నా పాత్రకి మధ్య చాలా మార్పులు చేశారు. అది మొన్న వచ్చిన ట్రైలర్ లోనే స్పష్టంగా తెలిసిపోతోంది.

పవర్ స్టార్ వచ్చారంటే..

పవన్ కళ్యాణ్ గారితో పనిచేస్తున్నప్పుడు మొదట్లో కొంచెం నెర్వస్(టెన్షన్)గానే అనిపించింది. ఎందుకంటే సార్ సెట్ లోకి వచ్చారంటే అంతా పిన్ డ్రాప్ సైలెన్స్ అయిపోతుంది. అప్పటిదాకా పిచ్చిపిచ్చిగా ఉన్న వర్క్ అట్మాస్పియర్ అంతా ఆయన రాకతో కంప్లీట్ గా మారిపోతుంది. పని వేగంగా జరుగుతుంది. నేనేమో వాగుడు కాయని. ఎక్కువ మాట్లాడతా. ఆ మాటలు ఆయనకు వినిపిస్తాయేమో. డిస్టర్బ్ అవుతారేమోనని నాకు మొదటి రెండు రోజులు భయంభయంగా ఉండేది. షాట్ ని అంతా ఓకే చేశాక ‘వన్ మోర్’ తీసుకుంటే ఎవరైనా ఏదైనా అనుకుంటారేమోనని ఫీలయ్యేదాన్ని.

కానీ.. కంఫర్టబుల్ గా..

రోజులు గడుస్తున్నాకొద్దీ కన్ఫర్టబుల్ గా అనిపించింది. పవన్ కళ్యాణ్ గారు తన స్క్రిప్ట్, డైలాగ్స్, సీన్స్ మీద చాలా ఏకాగ్రత చూపేవారు. దాన్నిబట్టి నాకు నేను కన్విన్స్ అయ్యాను. మన పాత్ర వరకు మనం సరిగ్గా చేస్తే చాలు అని. మొత్తానికి పవర్ స్టార్ తో పనిచేయటం చాలా అద్భుతమైన అనుభవం అని చెప్పొచ్చు. దాదాపు ప్రతి రోజూ నివేదా థామస్, అనన్య, నేను కలిసి నటించే కాంబినేషన్ సీన్లే ఉండేవి. కాబట్టి మేం ముగ్గురం బాగా కనెక్ట్ అయ్యేవాళ్లం. మా మధ్య ఉంటే ఆ ర్యాపో సినిమాలో ఆకట్టుకుంటుంది.

ఎవరేంటో తెలుసు..

ఫస్ట్ డే నుంచే మా ముగ్గురి మధ్య ఆ బాండింగ్ ఏర్పడింది. అది లేకపోతే ఆ క్యారెక్టరైజేషన్లు ఫెయిలవుతాయి. మా ముగ్గురికీ తెలుసు ఎవరి స్పేస్ ఏంటనేది. అందుకే మా మధ్య ఎలాంటి ఇగో ఫీలింగ్స్, ఫైట్స్ లేవు. ఫైనల్ ఔట్ పుట్ చూస్తే మా మధ్య ఉన్న రియల్ ఫ్రెండ్షిప్ కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ గారు సెట్స్ లో హుందాగా, మర్యాదగా వ్యవహరిస్తారు. కుర్చీ వేసుకొని కూర్చొని అందరితోనూ మంచిగా మాట్లాడతారు. నేను ఆయన దగ్గరకు వెళ్లి మాట్లాడటానికి దాదాపు 15 రోజులు పట్టింది.

గంతులేశాను..

పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేసే ఛాన్స్ వచ్చినందుకు ముందుగా ఆనందంతో గంతులేశాను. మొదట్లో ఇది పవర్ స్టార్ సినిమా అనేదే నా మైండ్ లో ఉండిపోయింది. తర్వాత నా పాత్ర ఏంటనేది తెలుసుకున్నాక ఇంకా బాగా ఇన్వాల్వ్ అయ్యా. సహజంగా పెద్ద హీరోతో సినిమా అయితే మన రోల్ కనిపించదు. ఆ స్టార్ డమ్ లో మనం కొట్టుకుపోతాం. కానీ, ‘వకీల్ సాబ్’లో అలా జరగలేదు. నాకు ముందుగా ఏం చెప్పారో, నేను ఏం అనుకున్నానో మొత్తం అందులో ఉంది. దర్శకుడు వేణు గారు నాకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు.

సోల్ ఒక్కటే.. సినిమాలు రెండు..

నేను హిందీ ‘పింక్’, తెలుగు ‘వకీల్ సాబ్’ రెండూ దాదాపుగా మొత్తం చూశా. రెండింటి మధ్య చాలా తేడా ఉంటుంది. కథలో ఉండే ఆత్మ ఒక్కటే గానీ సినిమాలు మాత్రం వేరు. ప్రస్తుతం సమాజంలో మహిళలకు అభద్రతా భావం నెలకొంది. సొసైటీలో ఎవరికో ఎదురైన అనుభవం సాక్షాత్తూ మన ఇంట్లో ఒకరికి జరిగితే ఎలా ఉంటుంది? వాళ్ల జీవితాలు ఎలా మారిపోతాయి? అనేదే ఈ సినిమాలో చూపించారు. నేను ఏదో ఒక గంటో రెండు గంటలో నటించి పోతాను. కానీ అలాంటి కష్టాలను రోజూ అనుభవించేవాళ్లను తలచుకుంటే బాధగా అనిపిస్తుంది. నిజంగా ఎవరికీ ఇలాంటి పరిస్థితి రాకూడదని కోరుకుంటున్నా.

ముందు అమ్మాయిని.. తర్వాతే సెలెబ్రిటీ..

నాకు గానీ నా ఫీల్డ్ లో ఉన్న మరెవరికైనా గానీ ఇలాంటి సిచ్యుయేషన్ ఎదురైందా లేదా అనేది కాదు విషయం. సెలెబ్రిటీ అయినా సాధారణ అమ్మాయి అయినా ఎవరైనా ఒకటే. నేను ముందుగా ఒక అమ్మాయిని. ఆ తర్వాతే ఒక సెలెబ్రిటీని. ఈ పాత్ర నన్ను సెట్ లో నుంచి వెళ్లిపోయాక కూడా వెంటాడింది. వాస్తవానికి ఒక సన్నివేశాన్ని వేరే రోజు తీయాలనుకున్నారు. కానీ.. అనుకోకుండా ముందుగానే షూట్ చేశారు. నేను ఆ పాత్రలో లీనమైపోయాను. చివరికి ఒక రకమైన షాక్ లో వెళ్లిపోయా. చాలా సేపు ఎవరితో మాట్లాడలేదు. ఒంటి నిండా చెమటలు పట్టాయి.

ప్రకాష్ రాజ్ గారితో..

ప్రకాష్ రాజ్ గారితో గతంలో చాలా సార్లు కలిసి చేశాను. ఇందులో కూడా మా ఇద్దరి మధ్య మంచి మంచి సీన్లు ఉన్నాయి. ఆయన మామూలుగా మాట్లాడితేనే బిగ్గరగా అనిపిస్తుంది. అలాంటి వ్యక్తి ఒక్కసారిగా గట్టిగా మాట్లాడితే నాకు నిజంగానే భయమేసింది. ఏదేమైనప్పటికీ ఎదుటి వ్యక్తి ఎంత బాగా నటిస్తే మనం కూడా అంత బాగా యాక్ట్ చేస్తాం. యాక్షన్ కి రియాక్షన్ అన్నమాట. అటు నుంచి మంచి పెర్ఫార్మెన్స్ వస్తే ఇటు నుంచి కూడా దానికి తగ్గ స్టాయిలోనే ట్యాలెంట్ చూపిస్తాం. ఆ విధంగా ప్రకాశ్ రాజ్ గారితో కలిసి నటించటం నాకు కలిసొచ్చింది.

నో అంటే నో.. ఎస్ అంటే ఎస్..

ఒక అమ్మాయి తనకు ఇష్టమైతే దేనికైనా ‘ఎస్’ అని చెబితే తర్వాత జరిగే పరిణామాలకు ఆమే బాధ్యత వహిస్తుంది. కానీ ఇష్టం లేకపోయినా ‘నో’ చెప్పినా యాసిడ్ దాడి చేసో లేక మరో రకంగానో బలవంతంగా ఒప్పిస్తామనటం సరికాదు. ఎస్ అంటే ఎస్. నో అంటే నో. అంతే. ఆడవాళ్లకు మాత్రమే ఉండే ఆ హక్కును కాదనటానికి ఎవరికీ ఏ అధికారం లేదు. సినిమాలో నా పాత్ర దీని గురించే చెబుతుంది. దీని పై పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ కూడా ఒకటి ఉంటుంది. మహిళల పైన జరిగే దాడులను ఉపేక్షించకూడదు.

‘‘మగువా.. మగువా’’.. గురించి..

ఈ పాటను మొదట విన్నప్పుడే పెద్ద హిట్ అవుతుందనిపించింది. కానీ ఈ స్థాయిలో హిట్ అవుతుందని ఊహించలేకపోయాం. హిందీ ‘పింక్’లో ఇలాంటి సాంగ్ లేదు. తెలుగులో మాత్రమే యాడ్ చేశారు. ముగ్గురమ్మాయిల మధ్య అనుబంధాన్ని చూపించటం కోసం దీన్ని పెట్టారు. ఈ పాటలో చాలా హ్యాపీ మూమెంట్స్ ఉంటాయి. ఒక్కసారి చూసిన ప్రతిఒక్కరూ రెండోసారి చూపించమని అడుగుతారు. చిత్రీకరణ అంత బాగుంటుంది. ఈ సాంగ్ చూశాక మన ముఖాల్లో నవ్వులు కనిపిస్తాయనటంలో ఎలాంటి అనుమానంలేదు.

పెళ్లికి ముందు సెక్స్ పై..

పెళ్లికి ముందు సెక్స్ అనేది ఒకప్పుడు వినటానికే ఎంతో కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు చాలా ఈజీ అయిపోయిందన్న ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే అది వారివారి ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది. ఒక్కొక్కరి మైండ్ సెట్ ఒక్కోలా ఉంటుంది. మీకు కరెక్ట్ అనిపించింది నాకు అనిపించకపోవచ్చు. అందరూ ఒకేలా ఆలోచిస్తే అసలు ఈ నేరాలూ ఘోరాలే ఉండవు కదా. అందరూ క్రూయెల్ గా ప్రవర్తిస్తే  అన్నీ నేరాలే జరుగుతాయి. ఈ టాపిక్ ఇండివిడ్యువల్ ఛాయిస్. దీనిపై నాకు బహుశా ఏమీ తెలియకపోవచ్చు.

ఫెమినిజం(స్త్రీవాదం)పై..

ఈ పదాన్ని సరైన విధానంలో వాడాలి. ఇప్పుడు ఎక్కువగా వాడుకుంటున్నాం అనేది నా అభిప్రాయం. మంచికి గానీ చెడుకి గానీ ఏవిధంగానైనా బాగా వాడుకలో ఉందని మాత్రం చెప్పగలను. మంచి దారిలో వాడితే బాగుంటుందనే నా ఉద్దేశం. నా తదుపరి చిత్రాల పేర్లు ఇప్పుడే వెల్లడించలేను. వెల్లడించే అనుమతి లేదు. కానీ తెలుగు, తమిళం భాషల్లో మంచి ప్రాజెక్టులు చేస్తున్నానని మాత్రం చెప్పగలను. నన్ను నా పాత్రల పేరు పెట్టి పిలిచే జాబితాలో ‘వకీల్ సాబ్’ సినిమా క్యారెక్టర్ కూడా చేరుతుందనే నమ్మకం నాకుంది.

హీరోయిన్లకు ఆదరణ..

ఏ హీరోయిన్ అయినా తాను ఎంచుకునే సినిమా, కథ, పాత్ర, అందులో ఆ రోల్ నిడివి.. ఇలా చాలా అంశాల మీద ఆమెకు ఆదరణ అనేది ఆధారపడి ఉంటుంది. ఎన్ని సినిమాలు చేశాం అనేదానికన్నా ఎంత మంచి క్యారెక్టర్లు చేశాం అనేది ముఖ్యం. నేను ఒకరిని చూసి నేర్చుకోను. నా పద్ధతి మార్చుకోను. ఇప్పుడు ఏ రూట్ అయితే ఫాలో అవుతున్నానో భవిష్యత్తులోనూ ఇదే మార్గంలో వెళతా. సినిమా హిట్, ఫ్లాప్ అనేవి నా చేతిలో ఉండవు.

పవన్ గారు మెచ్చుకోవటం మర్చిపోలేను..

‘వకీల్ సాబ్’ పిక్చర్ లో  పర్టిక్యులర్ గా ఒక సీన్ చేశాక పవన్ కళ్యాణ్ గారు నన్ను చాలా బాగా మెచ్చుకున్నారు. అది నేనెప్పటికీ మర్చిపోలేను. ఎందుకంటే గతంలో పవర్ స్టార్ అంతలా చప్పట్లు కొట్టి ఎవరినీ ప్రశంసించలేదని నేను విన్నాను. నేను ట్యాలెంటెడ్ హీరోయిన్ అని అన్నందుకు థ్యాంక్స్. కానీ.. నేను పెద్ద పెద్ద హీరోలతో మూవీస్ చేస్తున్నా ఎందుకు నెక్స్ ట్ లెవల్ కి వెళ్లలేకపోయాననేది నాకు తెలియదు. ప్రస్తుతం నాకు ఉన్నదాంతో చాలా హ్యాపీగా ఫీలవుతున్నా.

Advertisement