Anand Bharati: అసిస్టెంట్స్‌కి డ్యుప్లెక్స్ హౌజ్‌లు క‌ట్టించిన ప్ర‌కాశ్ రాజ్.. ఆ సాయం మ‌రచిపోలేం అన్న ఆనంద్

Anand Bharati: విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాశ్ రాజ్ న‌టుడిగా ఎన్ని కీర్తి ప్ర‌తిష్ట‌లు సంపాదించారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. వెండితెరపై నవరసాలను పండించడంలో ఆయనకు ఆయనే సాటి. దక్షిణ భారత సినీ ప్రపంచంలో విలక్షణ నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా తనలోని విభిన్న పార్శ్వాలతో అభిమానులను అలరిస్తున్నారు ప్రకాశ్ రాజ్‌. మాఅధ్య‌క్ష ఎన్నిక‌ల్లో విష్ణుకి పోటీగా నిలిచిన ఆయ‌న ఓట‌మి పాల‌య్యారు. రీసెంట్‌గా త‌న‌తో పాటు త‌న ప్యానెల్ స‌భ్యులు అంద‌రు రాజీనామా ప్ర‌క‌టించి వార్త‌లలోకి ఎక్కారు.

Anand Bharati about Prakash Raj Greatness
Anand Bharati about Prakash Raj Greatness

మా ఎన్నిక‌ల సంద‌ర్భంలో ఆయ‌న‌ను కొంద‌రు నాన్ లోక‌ల్ అన్నారు. ఈ విష‌యంలో ప్ర‌కాశ్‌రాజ్ చాలా ఆవేద‌నే వ్య‌క్తం చేశాడు. అయితే ప్ర‌కాశ్ రాజ్ జూనియర్ ఆర్టిస్టుల‌ని పెద్ద‌గా ప‌ట్టించుకోరని, కలుపుకొని మాట్లాడే స్వ‌భావం ఆయ‌న‌కు లేద‌ని ప‌లువురు విమ‌ర్శించారు. ఈ నేపథ్యంలో ప్రముఖ నటుడు ఆనంద్ భారతి.. ప్రకాష్ రాజ్ గొప్పతనాన్ని తెలియజేస్తూ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

విలన్‌గా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎవడు, ఎక్స్ ప్రెస్ రాజా, గోలీమార్, దుబాయ్ శ్రీను, అతడు, నువ్వు నాకు నచ్చావ్, కిక్, బద్రి తదితర చిత్రాల్లో నటించాడు ఆనంద్ భారతి. ‘నేను కెరియర్ మొదలుపెట్టినప్పుడు చాలామంది నటీనటులు, విలన్లు పక్క ఇండస్ట్రీ నుంచి వచ్చేవారు. మన తెలుగులో నటించేవాళ్లు లేరా.. బయటవాళ్లు వచ్చి చేయడానికి మనలో ఏం తక్కువ అనుకునేవాడ్ని.. ఆ టైంలో ప్రకాష్ రాజ్ గారు కూడా వచ్చారు.

బద్రి సినిమాలో మెయిన్ విలన్‌గా ప్రకాష్ రాజ్ వస్తే.. ఈ మాత్రం మేం చేయలేం అనుకున్నాం.. కానీ రాను రాను తెలిసింది ఏంటంటే.. నిజంగా ఆ పాత్ర మాకు ఇస్తే మేం చేయలేం.. క్యారెక్టర్‌కి ప్రాణం పోస్తాడు ఆయన.. మనం చేస్తూ చేస్తూ పోతే ఏనాడైనా ప్రకాష్ రాజ్‌లా మనం చేయవచ్చు. బద్రి సినిమా అప్పటి నుంచి తెలుసు కాబట్టి.. సెట్‌లో కనిపిస్తే ఏరా ఎలా ఉన్నారు.. ఇంట్లో వాళ్లంతా బాగున్నారా? ప్రాబ్లమ్ ఏం లేదుకదా అని అడుగుతారు.

ఆయన దగ్గర మేం ఏం సాయం తీసుకోలేదు కానీ.. ఆయనకు బాగా హెల్పింగ్ నేచర్ ఎక్కువ.. వాళ్ల అసిస్టెంట్స్‌కి మణికొండలో డూప్లెక్స్ హౌస్‌లు కట్టిచ్చారు. ఈరోజుల్లో అలాంటి సాయం ఎవరు చేస్తారు.. అది ఆయన గొప్పతనం’ అంటూ ప్రశంసలు కురిపించారు ఆనంద్ భారతి.