Allu Arjun: బాబోయ్.. బ‌న్నీ త‌న పుష్పతో అంత పెద్ద రిస్క్ చేస్తున్నాడా..!

Allu Arjun: అల్లు అర్జున్ సినిమాలకు ఇప్పుడు తెలుగులోనే కాకుండా సౌత్ ఇండియాలో మొత్తం మంచి మార్కెట్ ఉంది. అన్ని భాషలలో కూడా ఈయన సినిమాల కోసం అభిమానులు వేచి చూస్తున్నారు. ముఖ్యంగా మలయాళంలోనూ బన్నీ మార్కెట్ చాలా బాగుంది. తమిళంలో ఇప్పుడిప్పుడే ఈయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతుంది. కర్ణాటకలో మెగా కుటుంబానికి ఎప్పుడూ డిమాండ్ బాగానే ఉంటుంది.

Allu Arjun

ఇక తెలుగులో ఏం చెప్పాలి..? ఇక్కడ బన్నీ స్టార్ హీరో. ఈయన నటించిన గత సినిమా అల వైకుంఠపురములో 150 కోట్లకు పైగా షేర్ వసూలు చేసిందంటేనే బన్నీ రేంజ్ ఎంత పెరిగింది అనేది అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈయన పుష్ప సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ ఇంకా 45 రోజులు బ్యాలెన్స్ ఉంది. ఆగస్ట్ 13న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకున్నా కూడా కరోనా కారణంగా వాయిదా పడింది.

ఇప్పుడు ఈ చిత్రాన్ని డిసెంబర్ 24న విడుదల చేయాలనుకుంటున్నారు నిర్మాతలు. ఇదిలా ఉంటే అదే రోజు మరో సినిమా కూడా రాబోతుందని ప్రచారం జరుగుతుంది. అది కూడా పాన్ ఇండియన్ సినిమా. బాహుబలి తర్వాత దేశమంతా ఇప్పుడు ఒకే సినిమా గురించి వేచి చూస్తున్నారు.. అదే కేజియఫ్ 2. ఇప్పుడు ఇదే సినిమాతో అల్లు అర్జున్ పోటీ పడబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

డిసెంబర్ 24న కేజియఫ్ 2 విడుదల కానుందని ప్రచారం జరుగుతుంది. జులై 16న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకున్నా కూడా కరోనా కారణంగా వాయిదా పడింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అన్నీ పూర్తి చేసి క్రిస్మస్ కానుకగా ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు. ఈ క్రమంలో పుష్ప కూడా అదే రోజు వస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అదే కానీ జరిగిందంటే మాత్రం యశ్ వర్సెస్ అల్లు అర్జున్ వార్ మామూలుగా ఉండదు.

ఎందుకంటే రెండూ పాన్ ఇండియన్ సినిమాలే.. బడ్జెట్ పరంగా చూసుకుంటే పుష్ప రేంజ్ ఎక్కువ. అయితే కెజియఫ్ మొదటి భాగం ఇప్పటికే బ్లాక్ బస్టర్ కావడంతో సెకండ్ పార్ట్ తో పోటీ పడటం అంటే అంత ఈజీ కాదు. కానీ సుకుమార్ అండ్ టీం దీనిపై నమ్మకంగానే కనిపిస్తున్నారు. సంక్రాంతి వరకు ఆపితే అప్పుడు చాలా సినిమాలు పోటీకి వస్తాయి. దానికంటే ఒక్క సినిమాతోనే పోటీకి దిగడం మంచిది అనుకుంటున్నారు నిర్మాతలు. మరి చూడాలిక.. బన్నీ వర్సెస్ యశ్ బాక్సాఫీస్ వార్ జరుగుతుందో లేదో..?