Allu Arjun: బ‌న్నీ బాలీవుడ్ ఎంట్రీ..ఇక నార్త్ లోను రచ్చ చేయ‌నున్న ఐకాన్ స్టార్

Allu Arjun: అల్లు అర్జున్ బాలీవుడ్ వెళ్తున్నాడని చాలా రోజులుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఎందుకంటే ఈయనకు ఇక్కడే కాదు అక్కడ కూడా మంచి గుర్తింపు ఉంది. బన్నీ నటించిన సినిమాలు హిందీలో అనువాదమై అక్కడ రికార్డు వ్యూస్ సొంతం చేసుకుంటున్నాయి. మరీ ముఖ్యంగా యూ ట్యూబ్ లో అయితే అల్లు అర్జున్ నటించిన డిజేతో పాటు మరో రెండు మూడు సినిమాలు కూడా 300 మిలియన్స్ మార్క్ అందుకున్నాయి.

అంటే 30 కోట్లకు పైగానే ఈ సినిమాలను అక్కడ వాళ్లు చూసారని అర్థం. అందుకే బన్నీకి ముంబైలో భారీ డిమాండ్ ఉంది. అక్కడ బన్నీ డబ్బింగ్ సినిమాలకు విపరీతమైన డిమాండ్ ఉంది. అందుకే త్వరలోనే నేరుగా అక్కడ ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. పైగా అల్లు అర్జున్ కు బాలీవుడ్ లోనూ మంచి స్నేహితులు ఉన్నారు.

అందుకే అక్కడ వాళ్ల సలహాలు కూడా తీసుకుంటున్నాడు. సుకుమార్ పుష్ప సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు నేరుగా వెళ్లనున్నాడు అల్లు వారబ్బాయి. ఈ చిత్రాన్ని అక్కడ కూడా విడుదల చేస్తున్నారు. హిందీలో డబ్ చేసి ఒకేసారి విడుదల చేయబోతున్నారు. బాహుబలి తర్వాత మన సినిమాలకు క్రేజ్ పెరగడంతో బాలీవుడ్ నిర్మాతలు కూడా మన సినిమాలపై బాగానే ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే బన్నీ కూడా నేరుగా హిందీ ఆడియన్స్ ను పలకరిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన చేస్తున్నాడు.

ఈ క్రమంలోనే హిందీ దర్శకులు చెప్పే కథలు కూడా వింటున్నట్లు తెలుస్తుంది. ఆ మధ్య బాంట్లా హౌజ్ అనే సినిమా ప్రీమియర్ కు కూడా ఇక్కడ్నుంచి వెళ్లాడు బన్నీ. ఆ సినిమా దర్శకుడు నిఖిల్ అద్వానీతో ఓ సినిమా గురించి చర్చించాడనే వార్తలు కూడా వచ్చాయి. అయితే ఆ తర్వాత మళ్ళీ అంతా కామన్ అయిపోయింది. ఇప్పుడు మరోసారి బన్నీ బాలీవుడ్ ఎంట్రీపై వార్తలొస్తున్నాయి.

అల వైకుంఠపురములో సినిమాను ఇప్పుడు అక్కడ కార్తిక్ ఆర్యన్ హీరోగా రీమేక్ చేస్తున్నారు. షెహ్ జాదే పేరుతో అక్కడ రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రంలో బన్నీ గెస్ట్ రోల్ చేయబోతున్నాడనే ప్రచారం జరుగుతుంది. దీనిపై ఇంకా క్లారిటీ రాలేదు. అక్కడి దర్శక నిర్మాతలు అడిగినా కూడా బన్నీ మాత్రం తన నిర్ణయాన్ని హోల్డ్‌లో పెట్టాడంటున్నాయి అల్లు వర్గాలు. చూడాలిక.. బన్నీ బాలీవుడ్ ఎంట్రీ ఎలా ఉండబోతుందో..?