Allu Arjun: మ‌రో పాన్ ఇండియా చిత్రం ప్లాన్ చేసిన బ‌న్నీ.. ద‌ర్శ‌కుడు ఎవ‌రో తెలుసా?

Allu Arjun: తెలుగు సినిమా స్థాయి పెర‌గ‌డంతో మ‌న హీరోలంద‌రు పాన్ ఇండియా సినిమాలు చేసేందుకు ఆస‌క్తి చూపుతున్నారు. యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ వ‌ర‌స పెట్టి పాన్ ఇండియా సినిమాలు చేస్తుండ‌గా, రామ్ చ‌ర‌ణ్‌- ఎన్టీఆర్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన ఆర్ఆర్ఆర్ చిత్రం త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. విజ‌య్ దేవ‌ర‌కొండ లైగ‌ర్ అనే పాన్ ఇండియా సినిమాతో ప‌ల‌క‌రించ‌బోతున్నాడు. ఇక ఐకాన్ అల్లు అర్జున్.. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో పుష్ప అనే పాన్ ఇండియా సినిమా చేయ‌బోతున్నాడు. రెండు భాగాలుగా రూపొంద‌నున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ లారీ డ్రైవ‌ర్‌గా క‌నిపించ‌నున్నాడు.

పుష్ప చిత్రం తొలి భాగం ఈ ఏడాది విడుద‌ల కానుండ‌గా, సెకండ్ పార్ట్ వ‌చ్చే ఏడాది విడుద‌ల కానుంది. ఈ సినిమా త‌ర్వాత అల్లు అర్జున్ అన్ని పాన్ ఇండియా సినిమాలే చేస్తార‌ట‌. బ‌న్నీకి తెలుగు రాష్ట్రాల‌లోనే కాదు ఇత‌ర రాష్ట్రాల‌లోను ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ కాబ‌ట్టి ఆయ‌న‌తో చేయ‌బోవు ద‌ర్శ‌కులు కూడా పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ల‌నే సిద్ధం చేస్తున్నార‌ట‌. ఇష్క్, 24, మనం వంటి వినూత్న సినిమాలతో ఆకట్టుకున్న విక్రమ్ కె కుమార్ ఇప్పుడు బ‌న్నీ కోసం క్రేజీ ప్రాజెక్ట్ సిద్ధం చేశాడ‌ట‌. కొన్నాళ్లుగా ఫాం కోల్పోయిన‌ట్టు క‌నిపిస్తున్న‌విక్ర‌మ్ ప్ర‌స్తుతం నాగ చైత‌న్య‌తో థ్యాంక్యూ అనే సినిమా చేస్తున్నాడు.

థ్యాంక్యూ చిత్రంలో నాగ చైత‌న్య‌ను మ‌హేష్ బాబు ఫ్యాన్‌గా చూపించ‌నున్నారు. ఈ మధ్యే ఈ మూవీ షూటింగ్‌ను ఇటలీలో పూర్తి చేసుకున్నారు. థాంక్యూ అంటూ రాబోతోన్న ఈ మూవీ తదుపరి షెడ్యూల్‌ను హైద్రాబాద్ పరిసర ప్రాంతాల్లోనే షూట్ చేయబోతన్నట్టు టాక్. ప‌ది రోజుల‌లో సినిమా షూటింగ్ పూర్తి చేయ‌నున్నార‌ట‌. ఈ సినిమా త‌ర్వాత విక్ర‌మ్ క్రేజీ ప్రాజెక్ట్ చేసేందుకు సిద్ధ‌మైన‌ట్టు తెలుస్తుంది. బన్నీకి ఓ ప్యాన్ ఇండియన్ సబ్జెక్ట్‌ను విక్ర‌మ్ వినిపించ‌గా,ఓ పెద్ద నిర్మాణ సంస్థ ఈ మూవీని నిర్మించ‌నున్న‌ట్టు తెలుస్తుంది. మరి విక్రమ్ చెప్పిన కథకు బన్నీ ఓకే చెబుతారా? లేదా? అన్నది చూడాలి. అల్లు అర్జున్.. కొరటాల శివ ద‌ర్శ‌క‌త్వంలోను సినిమా చేయ‌నున్న విష‌యం తెలిసిందే.