Bollywood: బాలీవుడ్ ఏలేద్దామ‌నుకుంటున్న టాలీవుడ్ తండ్రి కొడుకులు

Bollywood: టాలీవుడ్ హీరోలకు ఇప్పుడు బాలీవుడ్ లోనూ మంచి గుర్తింపు వచ్చేసింది. అందుకే మన కుర్ర హీరోలకు అక్కడ కూడా అవకాశాలు వస్తున్నాయి. సత్యదేవ్ లాంటి యంగ్ హీరోలు తెలుగుతో పాటు హిందీలోనూ సినిమాలు చేస్తున్నారు. మరోవైపు విజయ్ దేవరకొండ కూడా త్వరలోనే బాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే నాగ చైతన్య కూడా బాలీవుడ్‌కు వెళ్తున్నాడు.

Akkineni Heroes Want to Rock in Bollywood
Akkineni Heroes Want to Rock in Bollywood

అక్కినేని కుటుంబానికి బాలీవుడ్ కొత్త కాదు. ఇప్పటికే ఈ ఫ్యామిలీ నుంచి తాత, తండ్రి అంతా హిందీ సినిమాలు చేసారు. అప్పట్లో నాగేశ్వరరావు సువర్ణ సుందరి సినిమాతో ఉత్తరాది ప్రేక్షకులను పలకరించాడు. ఇక నాగార్జున గురించి కొత్తగా చెప్పాల్సిందేం లేదు. ఈయన అక్కడ చాలా సినిమాలు చేసాడు. ఇప్పటికే డజన్ సినిమాలకు పైగా నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.

ఇప్పుడు వాళ్ల బాటలోనే నాగ చైతన్య కూడా వెళ్తున్నాడు. ఈయన కూడా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. అక్కడ తొలి సినిమా కోసం అన్నీ సిద్ధం చేసుకుంటున్నాడు నాగ చైతన్య. అయితే ఆయన హీరోగా కాకుండా మంచి పాత్రతో అక్కడి ఆడియన్స్ ను పలకరించబోతున్నాడు. అమీర్ ఖాన్ హీరోగా వస్తున్న లాల్ సింగ్ చడ్డా సినిమాలో నాగ చైతన్య కీలక పాత్రలో నటిస్తున్నాడు. దీనిపై చాలా రోజులుగా ప్రచారం జరుగుతూనే ఉంది.

ఈ పాత్ర కోసం ముందు విజయ్ సేతుపతిని ఎంచుకున్నారు. ఆయన చేస్తున్నట్లు మేకర్స్ కూడా ప్రకటించారు. షూటింగ్ కోసం డేట్స్ కూడా కేటాయించాడు. అయితే చివరి నిమిషంలో ఈయన డేట్స్ కుదరకపోవడం.. కరోనా కారణంగా షూటింగ్ ఏడాది పాటు వాయిదా పడటంతో విజయ్ తప్పుకున్నాడు. దాంతో ఇప్పుడు ఆ స్థానంలోనే నాగ చైతన్యను ఎంపిక చేసారు. కరోనా తర్వాత ఈ చిత్రం షూటింగ్ మొదలైంది. లధాఖ్‌లో జరుగుతున్న ఈ చిత్రీకరణలో నాగ చైతన్య కూడా పాల్గొంటున్నట్లు తెలుస్తుంది.

దక్షిణాది పాత్ర కావడంతో ఇక్కడి హీరోనే తీసుకున్నారు దర్శకుడు అద్వైత్ చందన్. హాలీవుడ్ లో హిట్ అయిన ఫారెస్ట్ గంప్ రీమేక్ ఇది. కరీనా కపూర్ ఈ సినిమాలో హీరోయిన్. రెండోసారి తల్లి కావడంతో ఈమె పాత్ర 2020లోనే పూర్తి చేసాడు దర్శకుడు. మరోవైపు నాగ చైతన్య ఈ సినిమా సెట్ లో అడుగు పెట్టాడు. చిన్న పాత్రే అయినా కూడా కీలక పాత్రలో నాగ చైతన్య నటిస్తున్నట్లు తెలుస్తుంది. మరోవైపు నాగార్జున కూడా బ్రహ్మస్త్ర సినిమాలో అమితాబ్ బచ్చన్, రణ్‌బీర్ కపూర్ తో కలిసి నటిస్తున్నాడు. మొత్తానికి తండ్రి కొడుకులు ఇద్ద‌రు బాలీవుడ్‌ని ఏలేద్దామ‌న‌కుంటున్నారు.