Adipurush డార్లింగ్ ప్రభాస్ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాడు. గత కొద్ది రోజుల క్రితం రాధేశ్యామ్ షూటింగ్ పూర్తి చేసిన ప్రభాస్ ఇప్పుడు సలార్ ,ఆదిపురుష్ చిత్రాలను ఏకకాలంలో రూపొందిస్తున్నాడు. గత కొద్ది రోజుల క్రితం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ చిత్రం పట్టాలెక్కగా, ఈ మూవీ షూటింగ్‌ని తెలంగాణలోని గోదావరి ఖనిలో జరుపుతున్నారు. ఇటీవల ఈ చిత్రంలో ప్రభాస్ లుక్కు సంబంధించిన ఫొటోలు కూడా బయటకు వచ్చాయి. చిత్రంలో ప్రభాస్‌కు జోడిగా శృతి హాసన్ నటిస్తోంది. హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై చిత్రం నిర్మితమవుతుంది.
ఇక బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ చేయనున్న 3డీ యాక్షన్ థ్రిల్లర్ ఆదిపురుష్ మూవీ ఈ రోజు నుండి ముంబైలో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ విషయాన్ని ప్రభాస్ తన సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. ఆదిపురుష్ ఆరంభ్ అంటూ ఓ ఫోటో పోస్ట్ చేశారు . రామాయణ ఇతిహాస గాధ ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించనున్నాడు. సైఫ్ అలీఖాన్ లంకేశ్ గా నటిస్తున్నాడు. ఇక సీత పాత్రలో కృతిసనన్ నటిస్తోందని , తల్లి పాత్రలో హేమమాలిన నటిస్తోందని వార్తలు వస్తున్నాయి. లక్ష్మణుడిగా టైగర్ ష్రాఫ్‌ని ఎంపిక చేసినట్టు టాక్.
పాన్ ఇండియా లెవల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఆదిపురుష్ సినిమాని ఇటు హిందీతో పాటు, తెలుగు, తమిళం, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ సినిమా కోసం మేకర్స్ 300 కోట్ల బడ్జెట్ కేటాయించినట్టు తెలుస్తుంది. ఈ సినిమాను భూషణ్ కుమార్ (టీ సిరీస్), ప్రసాద్ సుతార్, రాజేశ్ నాయర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ ఎపిక్ పీరియడ్ యాక్షన్ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ కోసం అవతార్, స్టార్ వార్స్ ఫేమ్ స్పెషలిస్టులను నిర్మాతలు సంప్రదించారని కథనాలు వెలువడుతున్నాయి. వచ్చే ఏడాది ఆగస్ట్ 11న ఆదిపురుష్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ ఎపిక్ ప్రాజెక్ట్‌లో విస్తృత శ్రేణి 3డి గ్రాఫిక్స్‌ను వాడనుండగా, చిత్రం మొత్తాన్ని పూర్తిగా గ్రీన్ మాట్ టెక్నాలజీలో చిత్రీకరించనున్నారు.