Adipurush : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఆదిపురుష్. పౌరాణిక గాథ రామాయణం నేపథ్యంలో 3డీ టెక్నాలజీతో రూపొందుతున్న ఈ చిత్రం నేటి నుండి షూటింగ్ జరుపుకునేందుకు సిద్ధమైంది. ఈ రోజు ఉదయం ఆదిపురుష్ ఆరంభం అంటూ ప్రభాస్ ఓ పోస్ట్ పెట్టడంతో అభిమానుల ఆనందంతో ఉప్పొంగిపోయారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఆదిపురుష్ చిత్రంలో ప్రభాస్ రాముడిగా కనిపించనుండగా, సైఫ్ అలీఖాన్ లంకేశ్ పాత్రలో మెరవనున్నాడు. ఇక లక్ష్మణుడిగా టైగర్ ష్రాఫ్, రాముడి తల్లి కౌశల్యగా హేమమాలిని, సీతగా కృతిసనన్ కనిపించనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
‘ఆదిపురుష్’ ఆరంభ్ అంటూ చిత్రయూనిట్ నుంచి వచ్చిన ప్రకటన రెబల్ స్టార్ అభిమానుల్లో జోష్ నింపింది. దాదాపు 300 కోట్ల బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఐదు భాషల్లో టీ సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ వర్క్‌ను ఇటీవలే స్టార్ట్ చేసిన చిత్ర యూనిట్ మంగళవారం సినిమాను లాంఛనంగా ప్రారంభించింది. 2022 ఆగస్ట్ 11న విడుదల చేయనున్నారు. మరోవైపు ప్రభాస్ సినిమాల విషయంలో దూకుడు పెంచాడు.ఇటీవల సలార్ షూటింగ్ కూడా మొదలు పెట్టిన ప్రభాస్ కొన్ని యాక్షన్ సీన్స్‌లో పాల్గొన్నాడు. తాజాగా దీనికి బ్రేక్ ఇచ్చి ఆదిపురుష్ షూటింగ్లో పాల్గొనేందుకు ముంబైకు వచ్చాడు.
ఈ రోజు ప్రభాస్‌పై కొన్ని సన్నివేశాలను ఓం రౌత్ తెరకెక్కించినట్టు తెలుస్తుంది. అయితే తాజాగా ఆదిపురుష్ సెట్లో భారీ అగ్ని ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. షూటింగ్ ముగిసిన కొద్ది నిమిషాలకే ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడి సిబ్బంది అలర్ట్ కావడంతో సెట్ పూర్తిగా దగ్ధం కాలేదని సమాచారం. ఇక ఈ రోజు షూటింగ్లో ప్రభాస్‌తో పాటు సైఫ్ అలీ ఖాన్ కూడా పాల్గొనగా వారు పెద్ద ప్రమాదం నుండి బయటపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారిస్తున్నట్టు తెలుస్తుంది.