Siddharth: వ‌య‌స్సుపై సెటైర్స్.. ఎక్కడ్నుంచి వస్తార్రా అంటూ సిద్ధార్ద్ ట్వీట్

Siddharth: బొమ్మ‌రిల్లు సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కి చాలా ద‌గ్గ‌రైన న‌టుడు సిద్ధార్థ్‌. ఈ సినిమా త‌ర్వాత చాలా సినిమాల‌లో న‌టించిన సిద్ధార్ద్ ఇక్క‌డి ప్రేక్ష‌కుల‌కి చాలా ద‌గ్గ‌ర‌య్యాడు. కొన్నాళ్లుగా ఆయ‌నకు తెలుగులో సినిమా ఆఫ‌ర్స్ రాక‌పోవ‌డంతో త‌మిళ ఇండ‌స్ట్రీకి ప‌రిమితం అయ్యాడు. తాజాగా మ‌హా స‌ముద్రం చిత్రంతో రీఎంట్రీ ఇస్తున్నాడు.

ఆర్ఎక్స్ 100’ ఫేమ్ డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న మ‌హా స‌ముద్రం చిత్రంలో శ‌ర్వానంద్‌, సిద్ధార్థ్ ప్రధాన పాత్ర‌లు పోషిస్తున్నారు. సముద్రం నేపథ్యంలో లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా నిర్మితమవుతున్న ఈ చిత్రంలో అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్ప‌టికే సిద్ధార్థ్ లుక్ విడుద‌ల కాగా, ఈ లుక్ అభిమానుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి.

Actor Siddharth Fires on Netizen
Actor Siddharth Fires on Netizen

అయితే సిద్ధార్థ్ ఇటీవ‌లి కాలంలో సామాజిక అంశాల‌తో పాటు కేంద్ర ప్ర‌భుత్వానికి వ్య‌తిరేఖంగా ట్వీట్స్ చేస్తున్నాడు. కరోనా వైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా ఇంత దుర్భరమైన పరిస్థితి ఏర్పడేందుకు కేంద్రంలో ఉన్న బీజేపీనే కారణమంటూ.. అతను ట్వీట్లు చేశాడు. దీనిపై బీజేపీ నాయ‌కులు మండిప‌డ్డారు. కుటుంబాన్ని చంపేస్తామ‌ని, అత్యాచారం చేస్తామ‌ని బెదిరింపులు కూడా చేయ‌డంతో పోలీసుల‌ని ఆశ్ర‌యించారు.

తనకు నచ్చని అంశాలపై ముక్కుసూటిగా చెబుతూ అతను తరచూ ఏదో ఒక సంచలనం సృష్టించాడు. తాజాగా అతను మరో వివాదాస్పద ట్వీట్ చేశాడు.వివరాల‌లోకి వెళితే జూలై 20న విడుద‌ల కానున్న నారప్ప సినిమా ప్ర‌మోష‌న్‌లో భాగంగా ఓ పాట‌ను విడుద‌ల చేశారు. ఇందులో వెంక‌టేష్‌కు జోడీగా అమ్ము అభిరామి న‌టించింది. ఇందులో వ‌య‌స్సు త‌క్కువ ఉన్న అమ్మాయితో వెంకీ రొమాన్స్ చేయ‌డం ప‌ట్ల ట్రోల్ చేస్తున్నారు. కేవ‌లం సినిమాలో భాగమే అని దీనిపై ట్రోల్ చేయాల్సిన అవ‌స‌రం లేద‌ని మ‌రికొంద‌రు అంటున్నారు.

ఓ నెటిజ‌న్ సిద్ధార్థ్‌ని ఈ మేట‌ర్‌లోకి లాగి ‘40 ఏళ్లు పైబడిన సిద్ధార్త్‌తో 20 ఏళ్ల హీరోయిన్లు నటిస్తే మాత్రం వల్లమాలిన ప్రేమలు, ముద్దుల ఎమోజీలు.. ఇదెక్కడి లాజిక్కో.. దిక్కుమాలిన లాజిక్ అంటూ’ ట్వీట్ చేసి సిద్ధార్ధ్‌ని ట్యాగ్ చేశాడు. దీనిపై సిద్ధార్త్ ఘాటుగా స్పందించాడు. ‘ఈ హీరోల వయస్సు టాపిక్‌లో ఫస్ట్ నేనే గుర్తొచ్చాను రా? ట్యాగ్ కూడా చేశావ్? సూపర్‌ రా దరిద్రమ్. ఎక్కడ్నుంచి వస్తార్రా మీలాంటోళ్లు?’ అంటూ సిద్ధార్త్ ట్వీట్ చేశాడు. కొంద‌రు.. ‘నువ్వు ప్రకాష్ రాజ్ క్లాస్ మేట్స్ అంటగా’ అంటూ మరో వ్యక్తి మళ్లీ సిద్ధార్థ్‌ని గెలికాడు.. దీనిపై కూడా సిద్ధార్త్ రియాక్డ్ అయ్యాడు. ‘ఛా! అతను నా దత్తపుత్రుడు.. నేను మోహన్ బాబు గారు క్లాస్‌మేట్స్.. ముందు నిజాలు తెలుసుకో’ అంటూ సిద్ధార్థ్ పేర్కొన్నాడు. దీనికి ‘సోది, అరాచకం, పరిస్థితుల ప్రభావం, దారుణం, నా వయస్సు నాకు తెలుసు’ అనే హ్యాష్‌ట్యాగులను ఆయన జత చేశారు.