అమ్మోరులో చిన్నాని తొలగించి, రామిరెడ్డితో రీ షూట్ ఎందుకు చేశారో తెలుసా?

Mamatha 600 - December 28, 2020 / 11:30 AM IST

అమ్మోరులో చిన్నాని తొలగించి, రామిరెడ్డితో రీ షూట్ ఎందుకు చేశారో తెలుసా?

తెలుగు సినిమా ఖ్యాతిని నలుదిశలా వ్యాపింప చేసిన చిత్రాలు చాలానే ఉన్నాయి.వీటిలో ప్రధానంగా ‘అమ్మోరు‘ చిత్ర ప్రస్తావన మాత్రం వచ్చి తీరుతుంది. ఎందుకంటే.., తెలుగు సినిమాకి గ్రాఫిక్స్ మాయని అద్భుతంగా పరిచయం చేసిన మొదటి చిత్రం అమ్మోరు కాబట్టి. నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డికి సినిమా అంటే పిచ్చి. ఆయన ఒక మంచి సినిమాని తీయడానికి జీవితం మొత్తాన్ని కూడా రిస్క్ లో పెట్టడానికి వెనకడుగు వేయరు.

ammoru movie

1991 లో విడుదలైన ‘ఆగ్రహం‘ మూవీ పరాజయం శ్యామ్ ప్రసాద్ రెడ్డికి నిరాశని మిగిల్చింది. ఆ బాధ నుండి బయటికి రావడానికి శ్యామ్ విదేశాలకి వెళ్ళిపోయాడు. హాలీవుడ్ లో అప్పుడప్పుడే గ్రాఫిక్స్ సినిమాలు ప్రభంజనం సృష్టిస్తున్నాయి. ఇది శ్యామ్ ప్రసాద్ రెడ్డిని బాగా ఆకర్షించింది. ఇలాంటి ప్రయత్నం తాను చేయాలి అనుకున్నాడు. ఇండియా వచ్చేశాడు. తన టీమ్ ని పిలిచి.. దేవత, దెయ్యం ఉండేలా పల్లెటూరి నేపథ్యంలో ఒక కథని సిద్ధం చేయమన్నాడు. అలా అమ్మోరు కథ సిద్ధం అయ్యింది. టీమ్ అందరికీ అమ్మోరు కథ బాగా నచ్చింది. కోదండరామిరెడ్డి దగ్గర అసోషియేట్ గా చేస్తున్న రామారావు అనే వ్యక్తిని దర్శకుడిగా ఎంచుకున్నాడు. అమ్మోరుగా రమ్యకృష్ణ ఫిక్స్. భక్తురాలిగా సౌందర్య ఫిక్స్. విలన్ గా చిన్నా ఫైనల్. 18 నెలల్లో షూటింగ్ పూర్తి చేశారు. శ్యామ్ ఆ రష్ అంతా పట్టుకుని గ్రాఫిక్స్ వర్క్ కోసం అమెరికా వెళ్ళాడు. తీరా అక్కడికి పోయాక.. ఈ మూవీ సీజీకి వీలు పడేలా తీయలేదని.., మళ్ళీ మొత్తం మార్చాలని చెప్పారు. అంతే శ్యామ్ ఒక్కసారిగా కుప్ప కూలిపోయారు. కోట్లలో నష్టం. మాములుగా ఎవరైనా అక్కడే ఆగిపోతారు. కానీ.., శ్యామ్ కి సినిమా అంటే పిచ్చి. అమ్మోరు కథ మీద అంతకన్నా నమ్మకం.

ఈసారి సీనియర్ డైరెక్టర్, తమ ఆస్థాన దర్శకుడు కోడి రామకృష్ణకి కబురు వెళ్ళింది. కోడి రామకృష్ణ రాకతో అమ్మోరు సినిమా స్వరూపం మారిపోయింది. విలన్ గా చిన్నా స్థానంలో రామిరెడ్డి వచ్చి చేరాడు. అప్పటి వరకు లేని పాప క్యారెక్టర్ వచ్చి చేరింది. బాబు మోహన్ ఫ్యామిలీ ట్రాక్ స్క్రీన్ టైమ్ మరింత పెరిగింది. దాదాపు మళ్ళీ రెండు సంవత్సరాలు తరువాత అమ్మోరు షూటింగ్ పూర్తి అయ్యింది. 1995 నవంబర్ 23 వ తేదీన అమ్మోరు ప్రేక్షకుల ముందుకి వచ్చింది. సినిమా ఫలితం ఓ ప్రభంజనం అయ్యింది. సినిమా హాల్స్ కాస్త గుడులుగా మారిపోయాయి. ప్రేక్షకులు చెప్పులు వేసుకోకుండా వచ్చి సినిమా చూశారు. థియేటర్స్ దగ్గర పెట్టిన అమ్మోరు విగ్రహాల ముందు వేసిన దక్షిణ మాత్రమే లక్షల్లో వసూలు అయ్యింది. ఇక కలెక్షన్ ఏ రేంజ్ లో వచ్చిందో అర్ధం చేసుకోవచ్చు. ఇది విజయం అంటే. కానీ.., క్యారక్టర్ ఆర్టిస్ట్ చిన్నా మాత్రం ఈ రకంగా ఓ మంచి పాత్రని కోల్పోయాడు.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us