సినిమా ఇండస్ట్రీకి 2020 గడ్డు కాలం అనే చెప్పవచ్చు. కరోనా వలన సినిమా షూటింగ్స్ ఆగిపోవడం, థియేటర్స్ మూతపడడంతో అందరిలో భయాందోళనలు నెలకొన్నాయి. సినీ పరిశ్రమ ఏమవుతుందో అని ఆందోళన చెందారు. అయితే ఈ ఏడాది విడుదలైన క్రాక్, ఉప్పెన, నాంది చిత్రాలు మళ్ళీ జోష్‌ను తీసుకొచ్చాయి. థియేటర్స్‌లో విడుదలైన చిత్రాలు భారీ వసూళ్ళను తీసుకురావడంతో అందరిలో నమ్మకం పెరిగింది. నాగార్జున లాంటి వారు తమ సినిమాలను ఓటీటీలో విడుదల చేయాలని భావించి చివరకు తన నిర్ణయాన్ని మార్చుకొని వైల్డ్ డాగ్ చిత్రాన్ని ఏప్రిల్ 2న థియేటర్స్‌లో విడుదల చేయబోతున్నారు.
ఇక 2021లో పెద్ద హీరోల సందడి బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్తో వస్తుండగా, ప్రభాస్ రాధేశ్యామ్ చిత్రంతో అలరించనున్నాడు. రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి ఆర్ఆర్ఆర్ సినిమాతో సందడి చేయనున్నారు. ఇక అల్లు అర్జున్ పుష్పతో పలకరించనున్నాడు. ఈ ఏడాది మహేష్ బాబు సినిమా ఒక్కటి కూడా విడుదల కావడం లేదు. అయితే వచ్చే ఏడాది మాత్రం స్టార్ హీరోలు బాక్సాఫీస్ దగ్గర సందడి చేసేందుకు పక్కా ప్లానింగ్‌తో రంగంలోకి దిగుతున్నట్టు అర్ధమవుతుంది. పవన్ కళ్యాణ్-క్రిష్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ సంక్రాంతి కానుకగా విడుదల అవుతుందని మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించారు. తాజా సమాచారం మేరకు జనవరి 12,2022న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇక సంక్రాంతి కానుకగా మహేష్ నటించిన సర్కారు వారి పాట చిత్రం జనవరి 14న విడుదల కానున్నట్టు సమాచారం. మరోవైపు అల్లు అర్జున్ తన 21వ చిత్రాన్ని మార్చిలో విడుదల చేస్తాడని అంటున్నారు. మార్చి 31న ఈ చిత్రం థియేటర్ లో రిలీజ్ కాబోతుందట. ఇక చిరంజీవి 153వ చిత్రంగా వస్తున్న లూసిఫర్ రీమేక్ ఏప్రిల్ 8న విడుదల కానుందని టాక్. ప్రభాస్- ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం సలార్ వచ్చే ఏడాది ఏప్రిల్ 14న విడుదల కానుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక జూనియర్ ఎన్టీఆర్ తన 30వ చిత్రంగా త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్నమూవీ ఏప్రిల్ 29న థియేటర్స్‌లోకి రానుందట. అంటే జనవరి నుండి ఏప్రిల్ మధ్య ప్రేక్షకులకు పసందైన విందు దొరకడం ఖాయంగా కనిపిస్తుంది.