Naraka Chaturdashi : నరకచతుర్దశి విశిష్టత..ఆరోజు ఏం చేయలి?
NQ Staff - October 22, 2022 / 10:54 AM IST

Naraka Chaturdashi : నరకుని సంహరించినట్లు వంటి చతుర్దశి కావడం కారణంగా ఈ రోజు నరకచతుర్దశి అని పేరు వచ్చింది. నరక చతుర్దశికి గల పేర్లు ప్రయత్న చతుర్దశి, కాలా చౌదస్, కాళ చతుర్దశి, అంధకార చతుర్దశి అనే కొన్ని పేర్లు వ్యవహారంలో ఉన్నాయి.
ఆశ్వయుజ బహుళ చతుర్దశినే నరక చతుర్దశి అంటాం. ఈ నరక చతుర్దశి తర్వాతి రోజే దీపావళి. తెలుగు పండుగల్లో నరక చతుర్దశి, దీపావళి ప్రముఖమైనవి. మనం ఆచరించే పండుగలలో ఒక రాక్షసుణ్ణి మరణాన్ని ఆనందంగా పండుగ చేసుకోవడం – నరక చతుర్దశి విశిష్టత.
నరకచతుర్దశి వెనుక కథేంటి?
పురాణ కథనం ప్రకారం.. భూదేవి, వరహా స్వామికి అసుర సమయంలో జన్మించిన నరకాసురుడు.. శ్రీహరి చేతిలో చావులేని విధంగా తల్లి చేతిలోనే మరణించేలా వరం పొందుతాడు. వరగర్వంతో లోకకంటకుడిగా తయారైన నరకుడు ముల్లోకాలను పట్టిపీడించాడు. నరకాసురుడి బాధలు భరించలేని దేవతలు, మునులు, గంధర్వులు శ్రీహరికి తమ గోడు వెళ్లబోసుకున్నారు.
వారి మొర ఆలకించిన శ్రీమహావిష్ణువు ద్వాపర యుగంలో కృష్ణుడిగా అవతరించి సత్యభామతో నరకాసురుని సంహరింపజేశాడు. నరకాసుర సంహారంతో అందరూ అనందంగా పండుగ చేసుకున్నారు. చతుర్దశి నాడు నరకుడి మరణించాడు కాబట్టే దాన్ని నరకచతుర్దశి అంటారు.
ఈ చతుర్దశి యమునికి ఎంతో ఇష్టమైన రోజు. ఈ రోజు సూర్యోదయానికి ముందే నువ్వుల నూనెతో తలంటుకొని, అభ్యంగన స్నానం చేయాలి. ప్రత్యేకించి ఆ వేళ నువ్వులనూనెలో లక్ష్మి, మంచినీటిలో గంగాదేవి కొలువై ఉంటారని శాస్త్రాలు చెబుతున్నాయి.
యమ ధర్మరాజును స్మరించి, నమస్కరించి, యమ తర్పనం చేయడాన్ని విశిష్టంగా పెద్దలు చెబుతారు. అభ్యంగన స్నానానంతరం దక్షణాభి ముఖంగా ‘యమాయయః తర్పయామి’ అంటూ మూడుసార్లు నువ్వులతో యమునికి తర్పణం ఇవ్వడం ఆచారం.
ఆ రోజు ఏం చేయాలి?
యముణ్ణి పూజించి, మినుములతో చేసిన పదార్థాలు తినడంతోపాటు సూర్యాస్తమయం తర్వాత ముంగిట్లో, పడకగదిలో దీపాలను వెలిగించి, టపాకాయలు కాలుస్తారు. ఈ చతుర్దశి రోజు సాయంత్రం ఎవరైతే దీపాలు వెలిగించి దానధర్మాలు చేస్తారో వారి పితృదేవతలకు నరకబాధ తొలగుతుందని భారతీయుల నమ్మకం. ఆశ్వయుజ బహుళ చతుర్దశి నాటి రాత్రి రెండో జాములో నరకాసుర సంహారం జరిగింది. కనుక మూడో జాములో అభ్యంగస్నానం చేసినవారికి నరక భయం తీరుతుందని శాస్త్ర వచనం.
ఈ చతుర్దశినాడు నూనెలో లక్ష్మీదేవి, నీళ్లలో గంగాదేవి అధివసించి ఉంటారంటారు. కనుక నరక చతుర్దశినాడు సూర్యోదయానికి ముందుగానే తలస్నానం చేస్తే మంచిది. సాయంకాలం ఇంట్లోని దేవుడి మందిరంలోనూ, ఏదైనా దేవాలయంలోనూ దీపారాధన చేయటం శుభప్రదం.