TTD : అయోధ్యలో శ్రీవారి ఆలయం?.. బీజేపీ ఏమంటుందో?

Kondala Rao - February 27, 2021 / 08:30 PM IST

TTD : అయోధ్యలో శ్రీవారి ఆలయం?.. బీజేపీ ఏమంటుందో?

TTD : ఇప్పటికే సామూహిక వివాహాల కార్యక్రమమైన కళ్యాణమస్తుకి పచ్చజెండా ఊపిన తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఇప్పుడు మరో పెద్ద ప్రోగ్రామ్ పెట్టుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని టీటీడీ కళ్యాణ మండపాల్ని లీజుకి ఇచ్చి డెవలప్ చేయాలని తీర్మానించింది. దీనికోసం విధివిధానాలను రూపొందించింది. అలాగే ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో తిరుమల శ్రీవారి ఆలయ నిర్మాణానికి స్థలం ఇప్పించాల్సిందిగా ఆ రాష్ట్ర సర్కారుని, కేంద్ర ప్రభుత్వాన్ని కోరనుంది. తిరుపతిలోని అలిపిరి నుంచి తిరుమల కొండ మీదికి చేరుకునే మెట్ల మార్గంలో కూడా ఇకపై భక్తులకు అన్న ప్రసాద వితరణ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు శనివారం తిరుమలలోని అన్నమయ్య భవన్ లో టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన పాలక మండలి మీటింగ్ జరిగింది. సమావేశం అనంతరం ఆయన వివరాలను వెల్లడించారు.

రూ.2,937 కోట్లు..

2021-22 ఆర్థిక సంవత్సరంలో టీటీడీ బడ్జెట్ ను రూ.2,937 కోట్లుగా నిర్ణయించారు. దీనికి ధర్మకర్తల మండలి ఆమోదం తెలిపింది. బడ్జెట్ తోపాటు 80 అంశాల అజెండా పైన, ఇతర కీలక విషయాల పైన ఈ భేటీలో చర్చించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించే వేద పాఠశాల పేరును ఎస్వీ వేద విజ్ఞాన పీఠంగా మార్చారు. ఈ పీఠం పరిధిలోకి అన్ని వేద పాఠశాలలను తీసుకురానున్నారు. తిరుమలలో కరెంట్ వాడకాన్ని కంట్రోల్ చేయటానికి, గ్రీన్ పవర్ ని ఉపయోగంలోకి తీసుకు రావటానికి చర్యలు చేపట్టనున్నట్లు సుబ్బారెడ్డి వెల్లడించారు. ఈ మేరకు గెస్ట్ హౌజుల్లో, కాటేజీల్లో పవర్ మీటర్లు పెట్టనున్నట్లు తెలిపారు. తిరుపతిలోని బర్డ్ హాస్పిటల్ లోని ఓల్డ్ బిల్డింగులో పిల్లల ఆసుపత్రి ఏర్పాటుకు 9 కోట్ల రూపాయలు కేటాయించారు. శ్రీవారి అన్న ప్రసాదం, లడ్డూల తయారీ, స్వామివారి పూజ కోసం వినియోగించే నెయ్యి నిల్వలను పెంచాలని నిర్ణయించారు.

TTD : ttd trust board meeting given green signal to 2021-22 budjet

TTD : ttd trust board meeting given green signal to 2021-22 budjet

ఉగాది నుంచి: TTD

తెలుగు సంవత్సరాది అయిన ఉగాది నుంచి తిరుమలలో ఆర్జిత సేవలకు భక్తులను అనుమతించనున్నట్లు టీటీడీ చైర్మన్ పేర్కొన్నారు. రథ సప్తమి వాహన సేవలను ఘనంగా నిర్వహించినట్లు చెప్పారు. ఇకపై తిరుచానూరులోని పద్మావతీ అమ్మవారి గుడిలో తులాభారం కార్యక్రమం చేపట్టనున్నట్లు వెల్లడించారు. ముంబై, జమ్మూ తదితర ప్రాంతాల్లో కూడా శ్రీవారి ఆలయాలను నిర్మిస్తామని తెలిపారు. ఆర్జిత సేవలను మొదలుపెట్టేలోపు టీటీడీలోని వివిధ విభాగాల ఉద్యోగులకు, సిబ్బందికి కరోనా వ్యాక్సినేషన్ వేస్తామన్నారు. శ్రీనివాస మంగాపురంలో అన్నప్రసాద కేంద్రాన్ని ఏర్పాటుచేయనున్నట్లు తెలిపారు. గోమాతని జాతీయ ప్రాణిగా గుర్తించాలని కేంద్ర ప్రభుత్వానికి రిక్వెస్ట్ పంపనున్నట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వివరించారు. కాగా.. దేశ వ్యాప్తంగా కళ్యాణమస్తు కార్యక్రమాన్ని ప్రారంభించాలనుకునేది బీజేపీ హిందుత్వ అజెండాకి కౌంటర్ గానే అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో యూపీతోపాటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అయోధ్యలో శ్రీవారి గుడికి భూమిని కేటాయిస్తుందా లేదా అనే సస్పెన్స్ నెలకొంది.

Read Today's Latest Devotional in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us