TTD: మాట నిలబెట్టుకున్న తిరుమల తిరుపతి దేవస్థానం

TTD తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)వారు మాట నిలబెట్టుకున్నారు. హనుమంతుడి జన్మస్థానాన్ని అఫిషియల్ గా ప్రకటించారు. తిరుమల ఏడు కొండల్లోని ఆకాశ గంగకి సమీపంలో ఉన్న అంజనాద్రే ఆంజేయుడి పుట్టిన స్థలం అని స్పష్టం చేశారు. ఈ మేరకు తెలుగు సంవత్సరాది అయిన ఉగాది రోజే అధికారికంగా ప్రకటన చేస్తామని చెప్పారు గానీ తర్వాత దీనికి శ్రీరామనవమి సరైన సందర్భమని భావించి ఆ రోజు చెబుతామన్నారు. శ్రీరాముడికి ఆంజనేయుడు పరమ భక్తుడు కాబట్టి టీటీడీవారు ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ బుధవారం శ్రీరామ నవమి పండుగను పురస్కరించుకొని ఈ అద్భుతమైన ప్రకటన చేశారు. తిరుమలలోని నాదనీరాజనం వేదికగా జాతీయ సంస్కృత వర్సిటీ వీసీ ఆచార్య మురళీధర శర్మ ఈ వివరాలను వెల్లడించారు.

ఎన్నో ఆధారాలు..

‘‘హనుమంతుడు నిజానికి ఎక్కడ పుట్టాడు అనే ప్రశ్నకి సమాధానాన్ని అన్వేషించేందుకు టీటీడీ ఒక కమిటీని వేసింది. అందులోని పండితులు పలుమార్లు సమావేశమై, నాలుగు నెలల పాటు లోతుగా పరిశోధన చేసి, పురాణాలను, ఇతిహాసాలను, ఇన్ స్క్రిప్షన్స్ ని, జాగ్రఫీతోపాటు ఇస్రోవాళ్లు ఇచ్చి అక్షాంశాలను, రేఖాంశాలను పరిశీలించి ఆంజనేయుడు అంజనాద్రిలోనే జన్మించాడని నిరూపించేందుకు బలమైన ఆధారాలను సేకరించారు’’ అని మురళీ శర్మ పేర్కొన్నారు. అంజనాదేవి తపస్సు ఫలించి, వాయుదేవుడి ఆశీర్వాదంతో తిరుమల కొండల్లోని అంజనాద్రిపై వెలసిన జపాలీ తీర్థమే ఆంజేయుడి అసలైన జన్మ స్థలమని టీటీడీ వివరించింది.

జాపాలి మహర్షి పేరిట..

జాపాలి మహర్షి ఇక్కడే తపస్సు చేశారని, అందుకే ఆ ప్రాంతాన్ని జాపాలి తీర్థంగా పేర్కొంటున్నారని అన్నదానం చిదంబర శాస్త్రి తెలిపారు. ఈయన హనుమద్ ఉపాసకులు. తిమ్మసముద్రం సంస్కృత పాఠశాల రిటైర్డ్ అధ్యాపకుడు. ప్రకాశం జిల్లా చీరాలకు చెందినవారు. హనుమజ్జయంతిపై పీహెచ్డీ చేశారు. హనుమంతుడి పుట్టిన స్థలాన్ని క్లెయిమ్ చేసుకోవటానికి గుజరాత్, జార్ఖండ్, మహారాష్ట్ర, కర్ణాటక వంటి రాష్ట్రాలు ప్రయత్నం చేయగా చివరికి ఆ ఘనత ఆంధ్రప్రదేశ్ కి దక్కింది.

ఈ డిమాండ్ ఎప్పటిది?

అంజనాద్రిని ఆంజనేయుడి జన్మస్థలంగా ప్రకటించాలనే డిమాండ్ 1980 నుంచే ఉంది. ఈ మేరకు 1999 దాక సంతకాల సేకరణ ఉద్యమం జరిగింది. ఆ సంతకాలను అప్పటి టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వినాయకరావుకి పంపారు. కాగా టీటీడీ నియమించిన కమిటీ సభ్యులు.. ఎస్వీ వేద వర్సిటీ వీసీ ఆచార్య సన్నిధానం సుదర్శన శర్మ, ప్రొఫెసర్లు రాణిసదాశివమూర్తి, జానమద్ది రామకృష్ణ, శంకరనారాయణ, ఇస్రో సైంటిస్ట్ రేమెళ్ల మూర్తి, ఏపీ పురావస్తు శాఖ డీడీ విజయ్ కుమార్. కమిటీ కన్వీనర్.. ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ ప్రాజెక్టు ఆఫీసర్ ఆకెళ్ల విభీషణ శర్మ.

Advertisement