Tirumala: తిరుమల శ్రీవారికి.. 365 రోజులు.. 365 రకాల ప్రసాదాలు..

Tirumala: తిరుమల శ్రీవారికి నేడు గురువారం నుంచి 365 రోజులు 365 రకాల ప్రసాదాలను నివేదించనున్నారు. అంటే ఏడాది మొత్తం రోజుకొక రకమైన బియ్యంతో ప్రసాదాన్ని రూపొందిస్తారు. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)లో సనాతన ధర్మానికి శ్రీకారం చుడుతున్నారు. దేశంలో పండిన పంటల విత్తనాలతో ప్రకృతి సిద్ధంగా సాగుచేసిన బియ్యంతో నైవేద్యాన్ని తయారుచేసి స్వామివారికి సమర్పించనున్నారు. ఈ సంప్రదాయం బ్రటిష్ వారి పాలనకు ముందు అమల్లో ఉండేది. కాలక్రమంలో స్వస్తి పలికిన ఈ విధానాన్ని పునరుద్ధరిస్తున్నారు. ఇందులో భాగంగా రోజుకి మూడు పూటలు 195 కిలోల ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. ఆలయ అధికారులు, ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో ఈ క్రతువును నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా గూడూరు మండలం పినగూడూరులోని సౌభాగ్య గోశాల, సేవ్ సంస్థ నిర్వాహకుడు, ప్రకృతి వ్యవసాయవేత్త ఎం.విజయరామ్ ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశారు.

నిన్నే బయల్దేరిన వాహనం..

ఈ విషయమై ఎం.విజయరామ్ ఇప్పటికే టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డితో చర్చలు జరిపారు. ఈ మేరకు 15 రకాల ప్రకృతిసిద్ధ బియ్యంతో వాహనం నిన్న బుధవారమే తిరుమలకు బయల్దేరింది. ప్రకృతి వ్యవసాయానికి ఆద్యుడు సుభాష్ పాలేకర్, దివంగత రాజీవ దీక్షిత, ఆధ్యాత్మికవేత్త చాగంటి కోటేశ్వరరావుల స్ఫూర్తితో విజయరామ్ ఈ కార్యక్రమాన్ని తలపెట్టారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా ఉన్న ప్రకృతిసిద్ధ విత్తన ఉద్యమకారుల సహకారం తీసుకోనున్నారు.

దేశం నలుమూలల నుంచి..

పశ్చిమ బెంగాల్ కి చెందిన అనుపమస్వామి నుంచి 30-40 రకాలు, ఒడిశాకు చెందిన సబర్మతి నుంచి 10 రకాల ప్రకృతిసిద్ధ బియ్యాన్ని సేకరించి అందించనున్నారు. గురువారం నుంచి వారం రోజుల పాటు తిరుమలలో ఉండి టీటీడీ ప్రధాన అర్చకులకు ప్రకృతిసిద్ధ పంటలతో వంటలు చేసి భోజనం వడ్డించనున్నారు. స్వామివారి నైవేద్యంతోపాటు లడ్డూ ప్రసాదం, ఉచిత అన్న దానాన్ని కూడా ప్రకృతిసిద్ధంగా భక్తులకు అందించాలని అనుకుంటున్నారు.

అవి ఇవే..

తిరుమలకు 15 రకాల వరి బియ్యం పంపించారు. అవి.. బాహురూపి, నారాయణ కామిని, రత్నచోళి, కాలాబట్, చింతలూరు సన్నం, రాజ్ బోగ్, రాజ్ ముడి, చిట్టి ముత్యాలు, బాస్ బోగ్, తులసీ బాసు, గోవింద్ బోగ్, లాల్ చోనా, ఎర్ర బంగారం, మాపిళ్లే, సాంబ. వీటిని వికారాబాద్, గూడూరు మండలం పినగూడూరులంకల్లోని ప్రకృతి వ్యవస్థాయ క్షేత్రాల్లో పండించారు.

Advertisement