Sri Rama Navami : ఏటా శ్రీరామనవమి పర్వదినం వస్తోందంటే చాలు ప్రతి ఊరులోనూ ‘‘సీతారాముల కళ్యాణము సూతము రారండి’’ అనే పాట మైకుల్లో మారుమోగుతుంది. వినేవారి మనసు పులకించిపోతుంది. పెళ్లి పాటలు ఇంకెన్నొచ్చినా ఆ ఆధ్యాత్మిక సినిమా వివాహ గీతాన్ని బీట్ చేయటం సమీప భవిష్యత్తులో చాలా కష్టం. ఎందుకంటే మన దేశవ్యాప్తంగా రాములోరి కళ్యాణాన్ని ఎంత అంగరంగ వైభవంగా నిర్వహిస్తారో ఆ వేడుకకు అంత భక్తిపారవశ్యాన్ని అద్దే పాట అది మాత్రమే. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని భద్రాచలం దేవస్థానం తెలంగాణ రాష్ట్రంలోనే అతి పెద్ద రామాలయం. ఈ కోవెలలో శ్రీసీతారామచంద్ర స్వామివారి కళ్యాణం ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా జరుగుతుంది. భక్తులు వేల సంఖ్యలో వస్తారు. కానీ కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా గతేడాది నిరాడంబరంగా నిర్వహించారు. భక్తులను చాలా పరిమిత సంఖ్యలోనే అనుమతించారు. అయితే.. ఈసారి కూడా అలాగే జరపాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. ఈ విషయాన్ని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఇవాళ ఆదివారం ప్రకటించారు.
సీఎం కేసీఆర్ సూచనతో..
ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని మంత్రి తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కొవిడ్-19 కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో భద్రాద్రిలో శ్రీరామ నవమి వేడుకుల నిర్వహణపై దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఈరోజు ఖమ్మం జిల్లా (రవాణా శాఖ) మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, దేవాదాయ శాఖ కమిషనర్, జిల్లా కలెక్టర్లతో చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని భద్రాద్రి రాములోరి కళ్యాణాన్ని నిరాడంబరంగా జరపాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. గతేడాదిలాగే తక్కువ సంఖ్యలో భక్తులకు అనుమతిస్తామని స్పష్టం చేశారు. శ్రీరామ నవమి వేడుకలకు ప్రజలు భద్రాద్రి రావొద్దని రిక్వెస్ట్ చేశారు. రాములోరి పెళ్లి చూడటం కోసం ఆన్ లైన్ లో టికెట్లు బుక్ చేసుకున్నవారికి డబ్బులను తిరిగి ఇచ్చేస్తామని మంత్రి పేర్కొన్నారు.

అన్ని చోట్లా ఇంతే: Sri Rama Navami
కరోనా నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లోనూ కొవిడ్-19 నిబంధనలకు అనుగుణంగానే భక్తులకు దర్శనాలు కల్పిస్తామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చెప్పారు. కరోనా రూల్స్-రెగ్యులేషన్స్ ని పకడ్భందీగా అమలుచేయాలని ఆదేశించారు. టెంపుల్స్ ని శానిటైజ్ చేయాలని సూచించారు. భక్తులు సహకరించాలని కోరారు. ఈ ఏడాది శ్రీరామనవమి పండుగ వచ్చే నెల (ఏప్రిల్) 21వ తేదీన ఉందనే విషయం విధితమే.