Ganesh Mandapam : గణేష్ మండపానికి 316 కోట్లతో ఇన్స్యూరెన్స్.!
NQ Staff - August 29, 2022 / 05:27 PM IST

Ganesh Mandapam : ఏదన్నా అనుకోని ప్రమాదం జరిగితే.! ఏం ఫర్లేదు, భక్తులకే కాదు, ఆ గణేష్ మండపానికి సంబంధించి పూజారులు, ఆఖరికి చెప్పుల స్టాండ్ నిర్వాహకులకి సైతం భీమా కల్పించేశారక్కడ. ఇంతకీ ఎక్కడుంది ఆ గణేష్ మండపం.? ఇంకెక్కడ, దేశ ఆర్థిక రాజధాని ముంబైలో.
ఒకటి కాదు, రెండు కాదు.. పదీ కాదు, పాతికా కాదు.. ఏకంగా 316 కోట్ల రూపాయలతో ఇన్స్యూరెన్స్ చేయించారు గణేష్ మండప నిర్వాహకులు. ముంబైలోని కింగ్స్ సర్కిల్‌లో జేఎస్‌బీ సేవా మండల్, నగరంలోనే అత్యంత ఖరీదైన మండపంగా వార్తల్లోకెక్కింది. ఆ మండపం బాధ్యతలు చూసేవారితోపాటు, అక్కడికి వచ్చే భక్తులకు నిర్వాహకులు భీమా చేయించారు.
బంగారం, వెండి నగలకీ.. భక్తులకీ ఇన్స్యూరెన్స్..

organizers Ganesh Mandapam Insured 316 Crore Rupees
31.97 కోట్ల రూపాయల్ని ఆ మండపంలో గల బంగారం, వెండి వస్తువలకు సంబంధించి ఇన్స్యూరెన్స్ కోసం వినియోగించగా, మరో 263 కోట్ల రూపాయలు మాత్రం మండపం కోసమే ఇన్స్యూరెన్స్ చేయించారు. వాలంటీర్లు, పూజారులు, వంటవాళ్ళు, చెప్పులు భద్రపరిచేవారు, పార్కింగ్, సెక్యూరిటీ సిబ్బంది.. ఇలా అందరూ భీమా పరిధిలోకి వస్తారు.
అగ్ని ప్రమాదం, భూకంపం ముప్పు వంటి వాటి కోసం ఇంకో కోటి రూపాయల భీమా తీసుకున్నారట. ఫర్నీచర్, కంప్యూటర్లు, సీసీటీవీలు, స్కానర్లు ఈ పరిధిలోకి వస్తాయ్. 68 ఏళ్ళుగా గణేష్ మండపం ఏర్పాటు చేస్తున్నామనీ, వినాయక చవితి మొదలు 10 రోజులపాటు వేలాదిగా, లక్షలాదిగా భక్తులు తరలి వస్తారనీ, వారి భద్రత కోసమే ఈ చర్యలు తీసుకున్నామని నిర్వాహకులు తెలిపారు.