Jogini : సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతున్న విషయం తెలిసిందే. భారీ ఎత్తున భక్తులు అమ్మవారికి బోనాల సమర్పిస్తున్నారు. బోనాల ఉత్సవాల్లో భాగంగా కీలక ఘట్టమైన రంగం వైభవంగా నేడు జరిగింది. జోగిని స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు.
మాతంగి ఆగ్రహం..
పూజలు మెక్కుబడిగా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పూజలు వారి సంతోషానికే తప్ప.. తన కోసం చేయడం లేదని చెప్పారు. తనకు పూజలు చేస్తున్నారా వాస్తవం చెప్పండని ప్రశ్నించారు. ఎన్నితప్పులు చేసినా కడుపులో పెట్టుకుని చూసుకుంటున్న కదా బాలక..మహిళలు గర్భిణీలకు ఇబ్బంది లేకుండా చూస్కుంటా.. పూజలు మనసుపెట్టి ఘనంగా నిర్వహించండి..అని అన్నారు.

ప్రతి ఏడాది నాకు ఆటంకమే కలిగిస్తున్నారని.. మొక్కుబడి పూజలు చేస్తున్నా తన బిడ్డలే అని భరిస్తున్నానని తెలిపారు. గర్భాలయంలో శాస్త్రబద్దంగా పూజలు చేయాలని చెప్పారు. మొక్కుబడిగా కాకుండా.. సక్రమంగా పూజలు జరిపించాలన్నారు. సంతోషంగా పూజలు అందుకోవాలని అనుకుంటున్నానని చెప్పారు.
ఎన్ని రూపాల్లో తనను మారుస్తారని.. మీకు నచ్చినట్టుగా మారుస్తారా అని ప్రశ్నించారు. స్థిరమైన రూపంలో కొలువుదీరాలని అనుకుంటున్నానని చెప్పారు. ‘‘మీరు నాకు చేసిందేమిటి..?. దొంగలు దోచినట్టుగా నా నుంచే మీరు కాజేస్తున్నారు. మీరు కోరుకున్నది తప్పక నెరవేరుతుంది. మీ కళ్లు తెరిపించడానికే ఆగ్రహంతో వర్షాలు కురిపిస్తున్నాను.
ఆగ్రహం తట్టుకోలేరనే కోపాన్ని గోరంతే చూపుతున్నాను. మీరు కొండంత తెచ్చుకుంటున్నా నాకు గోరంతే పెడుతున్నారు. భక్తులు కంటతడి పెట్టకుండా చూడండి. నా బిడ్డలకు ఆపద రానివ్వను’’ అని స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. రంగం కార్యక్రమం తర్వాత ఏనుగుపై అమ్మవారి పటం ఊరేగింపు ప్రారంభమైంది.