Hanuma: హనుమంతుడి జన్మస్థలంపై ఈరోజు జరిగిన చర్చలో ఏం తేల్చారు?..

Hanuma: హనుమంతుడి జన్మస్థలంపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పండితులకు, కర్ణాటకలోని హంపి హనుమద్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు వ్యవస్థాపకుడు గోవిందానంద సరస్వతి మధ్య ఇవాళ గురువారం తిరుపతిలో జరిగిన చర్చ అసంపూర్తిగా ముగిసింది. హనుమంతుడు పుట్టిన ప్రదేశం తిరుపతిలోని అంజనాద్రేనన్న టీటీడీ ప్రకటనతో గోవిందానంద సరస్వతి ఏకీభవించలేదు. చర్చా కార్యక్రమం నుంచి బయటకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ టీటీడీపై ప్రశ్నల వర్షం కురిపించారు. హనుమంతుడు పుట్టిన ఇన్ని వందల సంవత్సరాల తర్వాత ఆయన జన్మస్థలంపై ఇప్పుడు ఈ చర్చేంటని అడిగారు. రామాయణం ప్రకారం కర్ణాటకలోని హంపే అంజన్న పుట్టిన ప్రదేశమని తేల్చిచెప్పారు.

Hanuma

పెద్దలతో చర్చించలేదు..

ఇలాంటి ధార్మిక విషయాలపై శంకరాచార్యులు, కంచి కామకోటి పీఠాధిపతులు, మద్వాచార్యులు, తిరుమల పెదజీయర్, చినజీయర్ సమక్షంలో చర్చించాలని గోవిందానంద సరస్వతి డిమాండ్ చేశారు. హనుమాన్ జన్మస్థలం నిర్ధారణకు టీటీడీ నియమించిన కమిటీకి ప్రామాణికత లేనే లేదని పేర్కొన్నారు. తిరుమల గిరి కొండల్లోని అంజనాద్రిపై వెలిసిన జపాలీ తీర్థమే ఆంజనేయుడి పుట్టిన చోటు అనేది అధికారుల అభిప్రాయమే తప్ప జీయర్ స్వాములకు సంబంధంలేదని తెలిపారు. టీటీడీ వాదనలు సామాన్యులను సందేహంలోకి నెట్టేలా ఉన్నాయని ఆక్షేపణ వెలిబుచ్చారు. టీటీడీ ప్రకటనపై తాను జీయర్ స్వాముల వద్దకి వెళ్తానని చెప్పారు.

Hanuma

ఎప్పుడు పుట్టారో చెప్పండి?..

హనుమంతుడు ఏ రోజు పుట్టాడో చెప్పాలని గోవిందానంద సరస్వతి కోరారు. ఆ తేదీయే అందుబాటులో లేనప్పుడు జన్మస్థలాన్ని ఎలా నిర్ధారిస్తారని నిలదీశారు. ‘‘అంజనా సుతుడు పుట్టిన కాలానికి సంబంధించి టీటీడీకి క్లారిటీ లేదు. అందుకే వాళ్లు తమ నివేదికలో మూడు తిథులు రాశారు. హనుమంతుడి జన్మ ప్రదేశాన్ని పురాణాల ప్రకారం తేల్చలేం. పురాణాలు ప్రామాణికాలు కావు. రామాయణాన్ని టీటీడీ పరిగణనలోకి తీసుకోవాలి. ఈ చర్చా కార్యక్రమాన్ని బహిరంగంగా నిర్వహించాలి. ఎవరికివారు ఇష్టమొచ్చినట్లు కమిటీలు వేసి సున్నితమైన ఇలాంటి విషయాల్లో నిర్ణయం తీసుకోకూడదు’’ అని గోవిందానంద సరస్వతి అభిప్రాయపడ్డారు. టీటీడీ విడుదల చేసిన పుస్తకం గురించి తాను ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి వివరిస్తానని అన్నారు. చర్చలో ఎవరు గెలిచారు, ఎవరు ఓడారు అనేది ముఖ్యం కాదని, నిజమేంటో తేలాలని చెప్పారు.