Amarnath Yatra : జూన్ 30వ తేదీన ప్రారంభమైన అమర్‌నాథ్ యాత్ర విషాదంగా మారిన విషయం తెలిసిందే. అమర్‌నాథ్ యాత్రలో భారీ వర్షాలు, వరదల కారణంగా ఇప్పటి వరకు 16 మంది మరణించారు. మరో 40 మంది వరకు గల్లంతయ్యారు. వారి కోసం సహాయక బృందాలు నిరంతరాయంగా శ్రమిస్తున్నాయి. విరిగిపడిన కొండచరియల్లో దాదాపు 40 మంది వరకూ ఉండవచ్చని అనుమానిస్తున్నారు.
యాత్ర తిరిగి ప్రారంభం..

యాత్రికులు, వారి కుటుంబీకుల కోసం ఢిల్లీలోని ఏపీ భవన్‌లో హెల్ప్‌లైన్ నంబర్‌ను ఏర్పాటు చేయడంతోపాటు ఉన్నతాధికారులను శ్రీనగర్‌కు పంపించినట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది.అమర్నాథ్ క్షేత్రం సమీపంలో ఆకస్మికంగా సంభవించిన వరద విపత్తులో ఇప్పటివరకు 16 మంది మృతిచెందిగా, వంద మందికిపైగా గాయపడ్డారు. వారికి వివిధ ప్రాంతాల్లో చికిత్సలు అందిస్తున్నారు.
అమర్‌నాథ్ యాత్ర మళ్లీ పాక్షికంగా ప్రారంభమైంది. పహల్గాం నుండి యాత్రను ప్రారంభించారు. బాల్తల్‌లో ఇంకా మరమ్మత్తులు పూర్తి కాలేదు. బురదను తొలగించేందుకు సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. బేస్ క్యాంప్ 12వ బ్యాచ్ బయలు దేరగా..కొత్త బ్యాచ్‌ను నిలిపేశారు. వాతావరణం అనుకూలించకపోవడంతో జమ్మూ నుంచి రెండు బేస్ క్యాంప్‌లకు అమర్‌నాథ్ యాత్రను సస్పెండ్ చేసినట్లు అధికారి ఒకరు పీటీఐ వార్తా సంస్థకు వెల్లడించారు.

జూన్ 30న మొదలైన అమర్ నాథ్ యాత్ర 43 రోజుల పాటు సాగనుంది. అంటే ఆగస్ట్ 11వ తేదీన రక్షా బంధన్ రోజు ముగియనుంది. మరో వైపు అమర్ నాథ్ యాత్రకు వెళ్లాలంటేనే భక్తులు భయాందోళనలకు గురవుతున్నారు.