Bathukamma: బతుకమ్మ పండుగ విశిష్టత.. పండుగ వెనుక గాథలు

NQ Staff - September 23, 2022 / 09:01 AM IST

160230Bathukamma: బతుకమ్మ పండుగ విశిష్టత.. పండుగ వెనుక గాథలు

Bathukamma: తెలంగాణ ప్రజలు ప్రత్యేకంగా జరుపుకునే పండుగ బతుకమ్మ. రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక. ప్రకృతిని ఆరాధిస్తూ, తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పే పండుగే ఈ బతుకమ్మ పండుగ. ఈనెల 25 నుంచి బతుకమ్మ పండుగకు తెలంగాణ రాష్ట్రం సిద్ధమవుతోంది. రోజూ బతుకమ్మను పేర్చి బతుకమ్మ ఆడేందుకు మహిళలు సిద్ధమవుతున్నారు.

ఆశ్వయుజ శుద్ధ పాడ్యమికి ముందురోజు వచ్చే అమావాస్య రోజున ఎంగిలి పూల బతుకమ్మ పేరుతో ప్రారంభమై దుర్గాష్టమి రోజున సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. అంటు వ్యాధులు, కరువు కాటకాల బారినుంచి ప్రజల్ని కాపాడాలని ప్రార్థిస్తూ ప్రకృతి గౌరిని ఆటపాటలతో పూజించే వేడుకే ఇది.

తెలంగాణ పల్లె పల్లెల్లో జరుపుకునే ఈ పండుగ ఇప్పుడు ఎల్లలు దాటి దేశ విదేశాల్లోనూ ఘనంగా జరుపుకుంటున్నారు. ఇంతకీ బతుకమ్మ అనే పేరు ఎలా వచ్చింది..ఈ పండుగ వెనుక ప్రచారంలో ఉన్న పురాణ, జానపథ కథలేంటో తెలుసుకుందాం.

బతుకమ్మ పండుగ వెనుక గాథ..

దక్షిణ భారతదేశాన్ని పాలించిన చోళ వంశ చక్రవర్తి ధర్మాంగదుడు సంతానం కోసం ఎన్నో పూజలు చేయడంతో అమ్మవారి అనుగ్రహంతో ఓ బిడ్డ కలిగింది. ఎన్నో గండాలు దాటి బిడ్డ భూమ్మీదపడడంతో ఆమెకు బతుకమ్మ అని నామకరణం చేశారట. అప్పటి నుంచీ బతుకు ప్రసాదించాలని కోరుతూ బతుకమ్మను కొలుస్తారని పురాణగాథ.

పండుగ వెనుక ఉన్న జానపద గాథ

ఏడుగురు అన్నదమ్ములకు ఓ ముద్దుల చెల్లి. ఆమె అన్నలకు ప్రాణమైనా వదినలకు మాత్రం అసూయ. ఓ రోజు అన్నలు వేటకెళ్లి ఎంతకాలమైనా తిరిగిరావకపోవడంతో వదినల వేధింపులు భరించలేక ఆడబిడ్డ ఇల్లొదిలి వెళ్లిపోయింది. ఆ తర్వాత ఆమె అన్నయ్యలు తిరిగొచ్చి జరిగింది తెలుసుకుని నిద్రాహారాలు మాని చెల్లిని వెతికారు. ఓ ఊరి పొలిమేర దగ్గర బావిలో దాహం తీర్చుకుంటూ ఉండగా పెద్ద తామరపూవొకటి వీళ్లవైపు తేలుతూ వచ్చిందట. తమ చెల్లెలు ఆ తామర రూపంలో వచ్చిందని భావించారు అన్నలు. ఆ రాజ్యాన్నేలే రాజు ఆ అన్నదమ్ముల దగ్గర్నుంచి ఆ పూవుని తీసుకెళ్లి తన తోటలో కొలనులో వేయగా చుట్టూ దట్టంగా తంగేడు మొక్కలు మొలిచాయట. ఆ తామరే శ్రీలక్ష్మి అవతారంగా భావించి పువ్వులకు బతుకుతెరువు చూపింది కాబట్టి బతుకమ్మగా పూజించడం మొదలు పెట్టారట.