Saddula Bathukamma : ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు
NQ Staff - October 3, 2022 / 10:45 PM IST

Saddula Bathukamma : తెలంగాణలో సద్దుల బతుకమ్మ వేడుకలు అంబరాన్నంటాయి. ఊరూ వాడా మహిళలు రంగు రంగుల పూలను పేర్చి సద్దుల బతుకమ్మను తయారు చేశారు. అనంతరం మహిళలందరూ ఒకచోట చేరి ఆడిపాడారు. అనంతరం గంగమ్మ ఒడికి బతుకమ్మలను చేర్చారు.
ఎల్బీ స్టేడియంలో..
ఎల్బీ స్టేడియంలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్యర్యంలో నాలుగు వేల బతుకమ్మలను పేర్చి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఎల్బీ స్టేడియం నుంచి మహిళలు బతుకమ్మలను ఎత్తుకుని భారీ ప్రదర్శనగా ట్యాంక్‌బండ్ చేరుకున్నారు. ఈ ర్యాలీలో కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
ట్యాంక్ బండ్ పై కవిత..
ట్యాంక్‌బండ్‌పై తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన బతుకమ్మ వేడుకల్లో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. వేడుకల్లో పాల్గొన్న మహిళలతో కలిసి కవిత ఆడిపాడారు. బతుకమ్మలతో హుస్సేన్‌సాగర్ కళకళలాడింది. అనంతరం బాణసంచా ప్రదర్శన జనాన్ని కట్టిపడేసింది.
సూర్యాపేటలో ఘనంగా..
సూర్యాపేటలో సద్దుల బతుకమ్మ సంబురాలు ఘనంగా జరియగాయి. రంగురంగుల పూలను ఒద్దికగా పేర్చి..రాగ యుక్తమైన పాటలకు లయబద్దమైన తాళం వేస్తూ మహిళలు ఆడిపాడారు.
ఖమ్మంలో..
ఖమ్మంలో బతుకమ్మ వేడుకలు అంబరాన్నంటాయి. మహిళలు వివిధ రకాల పూలతో బతుకమ్మలను పేర్చారు. వాటి చూట్టూ ఆడిపాడారు.
అంబరాన్నంటిన సంబురాలు..
సత్తుపల్లిలో బతుకమ్మ వేడుకలు అంబరాన్నంటాయి. తీరొక్క పూలతో మహిళలు బతుకమ్మలను అందంగా పేర్చారు. మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై ఆడిపాడి సందడి చేశారు.
మంచిర్యాలలో..
మంచిర్యాల జిల్లా కేంద్రంలో సద్దుల బతుకమ్మ వేడుకల్లో భారీసంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. బతుకమ్మ, కోలాటం ఆడుతూ సంబరాలు చేసుకుని.. బతుకమ్మను గంగమ్మ ఒడికి చేర్చారు.