Bathukamma: బతుకమ్మని ఏఏ పూలతో పేరుస్తారు?

NQ Staff - September 23, 2022 / 09:11 AM IST

Bathukamma: బతుకమ్మని ఏఏ పూలతో పేరుస్తారు?

Bathukamma:  తెలంగాణ సంస్కృతికి అద్దంపట్టే బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుపుకునేందుకు మహిళలు సిద్ధమవుతున్నారు. ఈ నెల 25 నుంచి అక్టోబరు 3 వరకూ బతుకమ్మ వేడుకలు జరగనున్నాయి. పూల పండుగగా చెప్పే బతుకమ్మ కోసం ఈ పూలు ఆపూలు అని లేదు..ప్రకృతిలో దొరికే ఏ పూలైనా పేర్చొచ్చు. అప్పట్లో అయితే చుట్టుపక్కల దొరికే పూలన్నీ ఏరి పేరిస్తే..ఇప్పుడు మార్కెట్లో దొరికిన పూలతో బతుకమ్మలు పేరుస్తున్నారు.

పూలెందుకు పేర్చాలి..

వర్షాకాలం పూర్తై శీతాకాలం ఆరంభంలో వచ్చే పండుగ ఇది. ఈ సమయంలో చెరువులన్నీ నిండుకుండల్లా ఉంటాయి. ఎటుచూసినా పచ్చదనం పలకరిస్తుంది. గడ్డి మొక్క కూడా ఆహ్లాదకరంగా కనిపిస్తుంది. అందుకే అవి ఇవి అనే వ్యత్యాసం లేకుండా గడ్డి పూల నుంచి గులాబీలవరకూ అన్నీ సేకరించి ప్రకృతికి ధన్యవాదాలు తెలుపుతూ పూజిస్తారు. అనంతరం వాటిని నిమజ్జనం చేయడం వల్ల ఆ మొక్కల్లో ఉండే ఔషధ గుణాలు నీళ్లలో కలసి ఆ నీటిలో ఆక్సిజన్ శాతం పెరుగుతుంది. ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే వినాయక పూజకి పత్రిని వినియోగించడం, బతుకమ్మ వేడుకలకు పూలను ఉపయోగించడం వెనుకా ముఖ్య ఉద్దేశం ఇదే..

Flowers Used for Bathukamma Decoration

Flowers Used for Bathukamma Decoration

కొన్ని పూలు తప్పనిసరి

తంగేడు..

‘తంగేడు పువ్వప్పునే.. గౌరమ్మ.. తంగేడు కాయప్పునే..’ అంటూ బతుకమ్మ పాట కూడా ఉంది. ఈ పాటే చెప్పేస్తోంది బతుకమ్మను పేర్చడంతో తంగేడు పూలకున్న ప్రత్యేకత ఏంటో. మన దగ్గర ఎన్ని రకాల పూలున్నా. తంగేడు పువ్వు లేకపోతే బతుకమ్మ పూర్తవనట్టే అంటారు. బతుకమ్మలో కనీసం ఒక్క తంగేడు పువ్వైనా ఉండాల్సిందేనట.

గునుగు

తెల్లగా, పొడుగ్గా ఉండే ఈ పువ్వును బతుకమ్మ తయారీకి వాడతాడు. తెల్లని పూలకు రంగులద్ది అలంకరించేవారూ ఉన్నారు.

పట్టుకుచ్చు పువ్వు

వీటినే కొన్ని చోట్ల సీతజడ పూలు అని కూడా అంటారు. వెల్వెట్ క్లాత్‌లా చాలా మృదువుగా కనిపించే ఈ పూలు మంచి రంగుతో అందంగా మెరిసిపోతుంటాయి. బతుకమ్మలో పేరిస్తే ఆ అందమే వేరు.

బంతి

బతుకమ్మ పండగొచ్చిందంటే చాలు.. బంతి పూలతోనే శోభంతా. వాస్తవానికి ఏ పండుగొచ్చినా బంతిపూల సందడి ఎక్కువే. పట్టణాల వరకూ ఎక్కడైనా అందరికీ అందుబాటులో ఉండే ధరకే దొరికే ఈ పూలు ముద్దగా, అందంగానూ ఉంటాయి. వీటిలో వివిధ రంగులను వేర్వేరు వరుసలో ఉపయోగిస్తారు.

Flowers Used for Bathukamma Decoration

Flowers Used for Bathukamma Decoration

చామంతి

బతుకమ్మ తయారు చేయడంలో బంతి తర్వాత స్థానం చామంతిదే.. ఈ సీజన్‌లో బాగా దొరికే పూలు ఇవే కాబట్టి వీటిని బతుకమ్మలో ఎక్కువగా వాడుతుంటారు

రుద్రాక్ష

బతుకమ్మలో ఇంటి చుట్టుపక్కల దొరికే పూలన్నింటినీ ఉపయోగించొచ్చు. రుద్రాక్ష పూలకు పుల్లలు గుచ్చి బతుకమ్మ పేర్చడానికి ఉపయోగిస్తారు. కాడ చిన్నగా ఉండే పూలను దండలా చేసి కూడా వినియోగించవచ్చు.

మందారం

ఎర్రటి మందార బతుకమ్మకు చక్కటి శోభను తీసుకొస్తుంది. ఒకే రెక్కతో ఉండే మందారం అయితే బతుకమ్మ పైన పేరిస్తే బావుంటుంది. ముద్ద మందారం అయితే బంతిపూల మధ్యలో పేర్చుకుంటే కళ్లకు ఇంపుగా కనిపిస్తుంది.

గులాబీ

మందార పూలు దొరకకపోతే మంచి కాంబినేషన్ కోసం గులాబీలను కూడా ఉపయోగించుకోవచ్చు.

గన్నేరు

వీటిని కూడా బతుకమ్మ తయారీలో ఉపయోగిస్తారు. ముద్దగా ఉండే పూలైతే ఇంకా అందంగా ఉంటాయి.

నందివర్ధనం

రంగురంగుల పూల మధ్యలో తెల్లని నందివర్థనం ఆకాశంలో నక్షత్రాల్లా అందంగా కనిపిస్తుంది. అందుకే బతుకమ్మ పేర్చిన తర్వాత ఫినిషింగ్ లా నందివర్థనం అద్దుతారు.

కేవలం మామూలు పూలతో పాటు కూరగాయ మొక్కలైన గుమ్మడి, బీర, సొర కాయలాంటి పూలను కూడా ఉపయోగిస్తారు. వీటితో పాటు రకరకాల గడ్డిపూలతోకూడా బతుకమ్మలు పేరుస్తారు…

Read Today's Latest Bathukamma in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us