Bathukamma Festival : తెలంగాణలో ఎంగిలిపూలతో బతుకమ్మ వేడుకలు షురూ..
NQ Staff - September 26, 2022 / 10:34 AM IST

Bathukamma Festival : బతుకునిచ్చే పండుగ బతుకమ్మ పండుగ సంబురాలు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. తెలంగాణ సంస్కృతికి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మను తొలిరోజు ఎంగిలిపూలతో కొలిచారు.
తంగేడు, గునుగు, చామంతి, పట్టుగుచ్చులు ఇలా తీరొక్క పువ్వులతో బతుకమ్మలను అలంకరించారు. సాయంత్రం వేళ్లల్లో గ్రామాలు, పట్టణాల్లోని వీధుల్లోకి తీసుకువచ్చి ఒక్కేసి పువ్వేసి చందమామ.. ఉయ్యాల పాటలు పడుతూ.. చేతులతో చప్పట్లు చరుస్తూ ఆటలాడారు.
చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని ఉయ్యాల పాటలతో హోరెత్తించారు. బతుకమ్మల ఆటలతో తెలంగాణలోని వీధులన్నీ పూల వనాలను తలపించాయి.
గత రెండేళ్లుగా కొవిడ్ మహమ్మారి కారణంగా మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనలేకపోయారు. దీంతో ఈసారి రెట్టింపు ఉత్సాహంతో మహిళలు బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు.