Bathukamma Celebrations : బతుకమ్మకు ఉపయోగించే పువ్వుల్లో ఎన్నో ఔషధగుణాలు

NQ Staff - September 26, 2022 / 10:24 AM IST

Bathukamma Celebrations : బతుకమ్మకు ఉపయోగించే పువ్వుల్లో ఎన్నో ఔషధగుణాలు

Bathukamma Celebrations : తెలంగాణ సాంప్రదాయానికి ప్రతీక బతుకమ్మ పండుగ. తెలంగాణ ఆడపడుచులంతా ఒకచోట చేరి సంబరంగా జరుపుకునే వేడుక. బంధాలను, అనుబంధాలను గుర్తు చేస్తూ.. ప్రకృతిని ఆరాధిస్తూ, తెలంగాణ సంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి చాటిచెప్పే పండుగ బతుకమ్మ పండుగ.ఎంగిలిపూల బతుకమ్మతో బతుకమ్మ సంబురాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఎంగిలిపూల బతుకమ్మను పేర్చి ఆడిపాడారు.

ఆరోగ్యమస్తు..

ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమయ్యే సంబురాలు సద్దుల బతుకమ్మను సాగనంపడంతో ముగుస్తాయి. ఈ తొమ్మిది రోజులూ ప్రకృతిలో లభించే ప్రతి పువ్వునూ ఏరికోరి తెచ్చి, బతుకమ్మలను పేరుస్తారు మహిళలు. ఇలా బతుకమ్మకు ఉపయోగించే పూవుల్లో అనేక ఆరోగ్య అంశాలు ఇమిడి ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. గుమ్మడి, తంగేడు, గునుగు, బంతి, పట్నం బంతి, రుద్రాక్షతోపాటు వివిధ రకాల పువ్వుల్లో ఆరోగ్యానికి మేలుచేసే ఔషధ గుణాలు ఉన్నట్లు పేర్కొంటున్నారు. పూల నుంచి వచ్చే సువాసనలు, వాటి స్పర్శ ఆరోగ్యాన్ని పెంచుతాయని అంటున్నారు.

క్రిమిసంహారిణి

వర్షాకాలంలో చెరువులు, కుంటల్లోకి కొత్త నీరు చేరుతుంది. ఈ నీటిలో అనేక రకాల సూక్ష్మక్రిములు వృద్ధి చెంది, వ్యాధులను వ్యాపింపజేస్తాయి. ప్రస్తుతం నీటిని వడబోసే అనేక అధునాతన యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. కానీ, పూర్వకాలంలో ఇవేవి అందుబాటులో ఉండేవి కాదు. అయితే, బతుకమ్మలను చెరువులు, కుంటల్లో నిమజ్జనం చేయడం ద్వారా.. ఆయా పువ్వుల్లోని యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు సహజసిద్ధ క్రిమిసంహారకాలుగా పనిచేస్తాయి. నీటిలోని విష క్రిములను నిర్మూలిస్తాయి. అలా కొత్తనీటితోపాటు వచ్చే కొత్త రోగాల నుంచి కాపాడుకునే పండుగే.. బతుకమ్మ.

బంగారుతల్లి బతుకమ్మకు వాడే వివిధ పూలలోని ఔషధ గుణాలు తెలుసుకుందాం.

గుమ్మడి పువ్వు

బతుకమ్మను పేర్చడం గుమ్మడి ఆకులతో మొదలై.. గుమ్మడి పువ్వులోని గౌరమ్మను ప్రతిష్ఠించడంతో పూర్తవుతుంది. పండుగతోపాటే గుమ్మడి తీగ కూడా మొగ్గలు తొడుగుతుంది. ఈ పూలల్లో సహజసిద్ధ ‘పసుపు గౌరమ్మ’ కొలువై ఉంటుంది. గుమ్మడి పువ్వు శాస్త్రీయనామం కుకుంబిటాపిపో’దీనిలో విటమిన్‌-ఎ, సి పుష్కలం. వయసు మీద పడ్డాక వచ్చే కాళ్ల నొప్పుల్ని తగ్గిస్తుంది. ప్రొస్టేట్‌ గ్రంథికి ఎలాంటి హాని కలగకుండా కాపాడుతుంది కూడా.

తంగేడు

బతుకమ్మలో గుమ్మడి తర్వాత ఎక్కువ ప్రాధాన్యం కలిగిన పువ్వు.. తంగేడు. ఇది మన రాష్ట్ర పుష్పం. శాస్త్రీయనామం ‘కేసియా అరికులేటా’. దీనిని ఆయుర్వేదంలో విరివిగా వాడుతారు. ఈ పూల కషాయం తాగితే మధుమేహం అదుపులో ఉంటుంది. తంగేడు పూల పొడిని బెల్లంతో కలిపి తీసుకుంటే.. అతిమూత్ర వ్యాధి, నరాల బలహీనత దూరం అవుతాయి. తంగేడుపూల టీ తాగితే.. నెలసరి సమస్యలు తగ్గుముఖం పడుతాయి. కీళ్ల నొప్పులు తగ్గించడంలో, శరీరానికి చల్లదనాన్ని ఇవ్వడంలో తంగేడు సాయపడుతుంది. తంగేడు ఆకులు, పూలను చెరువులు, కుంటల్లో వేయడం వల్ల.. కొత్త నీటిలోని బ్యాక్టీరియా చనిపోతుంది.

గునుగు పూలు

బతుకమ్మను పేర్చడంలో ఎక్కువగా వాడేవి గునుగు పూలు. ఇవి గడ్డిజాతికి చెందినవి. ‘సెలోషియా’ దీని శాస్త్రీయనామం. ఈ మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. రక్తపోటును తగ్గించడంలో గునుగు పువ్వు ముందుంటుంది. నోటిలో పుండ్లు, ముక్కులో రక్త స్రావాన్ని తగ్గించడానికి దీనిని వాడుతారు. గునుగు పూలు చర్మంపై గాయాలు, పొక్కులను తగ్గిస్తాయి. దగ్గు, టీబీ, డయేరియాలకు చక్కని ఔషధం. గునుగు గింజలు సహజసిద్ధ రక్తస్రావ నివారిణిగా పనిచేస్తాయి. నేత్ర సంబంధ మందుల తయారీలో వాడుతారు. వీటిని తింటే.. మూత్ర సంబంధ సమస్యలూ తగ్గుతాయి.

పట్టుకుచ్చు (సీత జడ) పూలు

బతుకమ్మకు చక్కటి అందాన్ని ఇచ్చేవి పట్టుకుచ్చు (సీత జడ) పూలు. దీని శాస్త్రీయ నామం ‘సిలోసియా అరెగేటియా’. ఇది అమరాంథస్‌ కుటుంబానికి చెందిన మొక్క. పట్టుకుచ్చు పూలలో జలుబు, ఆస్తమాను తగ్గించే ఔషధ గుణాలు ఉంటాయి. వీటి ఆకులు గాయాలు, నోటి పొక్కులను నివారించడంలో సాయపడుతాయి.

పట్నం బంతి

బతుకమ్మలో వాడే మరో ప్రత్యేకమైన పువ్వు.. పట్నం బంతి. దీని శాస్త్రీయ నామం సెలెండ్యులా. ఇందులోని సుగుణాలు.. కండరాలు బిగదీసుకుపోకుండా నివారిస్తాయి. గొంతు నొప్పిని తగ్గించడంలోనూ చక్కగా పనిచేస్తాయి.

బంతి

బంతి పువ్వు ‘ఆస్టరేసి’ కుటుంబానికి చెందింది. క్రిసాంథిమమ్‌ బయాన్కో దీని శాస్త్రీయ నామం. శరీరంలోని వేడిని తగ్గిస్తుంది. కిడ్నీలో రాళ్లను కరిగించడంలో, చర్మంపై దద్దుర్లను తగ్గించడంలో సాయపడుతుంది. బంతి ఆకులను మెత్తగా చేసి, గాయాలు, పుండ్లపై రాస్తే.. త్వరగా మానిపోతాయి. పంటి నొప్పి, చిగుళ్ల వాపు, చిగుళ్ల నుంచి రక్తం కారడం లాంటి సమస్యలను తగ్గిస్తుంది. బంతిపూల రెక్కలను మిరియాలతో కలిపి తీసుకుంటే.. మూత్రంలో రక్తం, చీము వంటి
సమస్యలను నివారిస్తుంది.

తామర పువ్వు

ఆయుర్వేద మందులు, సుగంధ ద్రవ్యాల తయారీలో తామర పువ్వులు, నూనెను వాడుతారు. తామర తొడిమల నుంచి స్రవించే జిగురును డయోరియా నివారణలో, కొమ్మను అజీర్తి నివారణలో వినియోగిస్తారు. మలబద్ధకాన్ని తగ్గించడంలో తామర తైలం దివ్య ఔషధం. చర్మ సంబంధ వ్యాధులనూ నివారిస్తుంది.

బతుకమ్మ సంబరాల వల్ల మహిళలకు ఆరోగ్యపరంగా చాలా మేలు చేకూరుతుంది. ‘సద్దుల బతుకమ్మ’ సందర్భంగా తయారు చేసే సత్తు పిండి (నైవేద్యం) కూడా ఒక బలవర్ధకమైన ఆహారమే! బెల్లం, పల్లీలు, నువ్వులు.. తదితర పదార్థాలను ఉపయోగించి ఈ నైవేద్యాలు తయారు చేస్తారు. ఇవి మహిళల అనారోగ్య సమస్యలను దూరం చేయడంలో ముందుంటాయి. ఇలా పూలతో నీటిని శుద్ధి చేసుకోవడం, నైవేద్యంగా బలమైన ఆహారం తీసుకోవడం ద్వారా రోగనిరోధక శక్తి పెంచుకొని.. అందరూ హాయిగా, ఆరోగ్యంగా జీవించాలన్నదే ‘బతుకమ్మ పండుగ’ పరమార్థం.

Read Today's Latest Bathukamma in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us