ఆ ఎమ్మెల్యే ఎందుకు వైసీపీకి టాటా చెప్పడానికి రెడీ అవుతున్నారు ?
Surya - November 5, 2020 / 03:49 PM IST

గత ఎన్నికల్లో వైకాపాను సంపూర్ణంగా ఆదరించిన ఇచ్చిన జిల్లాల్లో నెల్లూరు జిల్లా ఒకటి. జిల్లాలోని 10కి 10 అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ అభ్యర్థులే గెలిచారు. ఇలాంటి జిల్లాలో పార్టీ కీలక నేతల నడుమ సఖ్యత తప్పిన వాతావరణం కనిపిస్తోంది. మంత్రి పదవుల కేటాయింపులు జరిగినప్పుడు జిల్లా ఎమ్మెల్యేల మధ్యన మొదలైన అంతరాలు తారాస్థాయికి చేరాయి. వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డికి యువ లీడర్లతో అస్సలు పొసగని పరిస్థితి కనబడుతోంది. జిల్లా రాజకీయాల్లో తనకు ప్రాధాన్యం తగ్గుతోందని భావించిన ఆనం జూనియర్ల డామినేషన్ తట్టుకోలేక పార్టీని వీడాలని అనుకున్నారు. కానీ అధిష్టానం కలుగకేసుకోవడంతో కాస్త నెమ్మదించారు.
ఇప్పుడు ఆయన బాటలోనే మరొక ఎమ్మెల్యే ఉన్నట్టు చెపుకుంటున్నారు. ఆయనది కూడ సేమ్ ఆనం రామనారాయణరెడ్డి సమస్యేనట. జిల్లాలో ఉన్న సీనియర్ నేతలు, మంత్రులే అన్ని పనులు చూసుకుంటున్నారు. వేరేవారి అవసరంకానీ, అవకాశం కానీ రావివ్వట్లేదట. మొదట్లో చూసీ చూడనట్టు వదిలేసినా సదరు సీనియర్ ఎమ్మెల్యే మెల్లగా స్వరం పెంచారట. దీంతో ఆయనపై కుట్రలు మొదలయ్యాయట. కార్యకర్తలనే తన మీదకు ఉసిగొల్పారని, అవినీతిపరుడని ముద్ర వేస్తున్నారని సదరు ఎమ్మెల్యే వాపోతున్నారట. ఈ సమస్యతో కేడర్ వద్ద కూడ చులకనైపోవాల్సి వస్తోందని గుర్రుగా ఉన్నారట.
ఈ లీడర్ కొత్తగా ఎమ్మెల్యే అయిన వ్యక్తేమీ కాదు. చాలా ఏళ్ల నుండి రాజకీయాల్లో ఉన్నారు. గతంలో కూడ వైసీపీ నుండి ఎంపీగా గెలిచారు. అలాంటి తనకు ఇన్ని అవమానాలా అని ఫీలవుతున్నారట. అందుకే పార్టీ మారే యోచన చేస్తున్నారని నెల్లూరు రాజకీయ వర్గాల టాక్. బీజేపీ లేదా టీడీపీలోకి జంప్ చేయాలని చూస్తున్నారట. జంప్ అంటే అలాంటి ఇలాంటి జంప్ కాదు. నొప్పించినవారికి గట్టి సమాధానం ఇచ్చే జంప్ అట. అవును ముందుగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేసి అటు పిమ్మట తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో పోటీచేసి గెలుపొంది తన సత్తా ఏమిటో నిరూపించుకోవాలనేది ఆయన ఉద్దేశ్యమట. మరి ఆయన ఉద్దేశ్యాలు ఫలిస్తాయా లేకపోతే వైసీపీ పెద్దలు బుజ్జగించి నీళ్లు చల్లుతారు అనేది చూడాలి.