YSRCP: కాకినాడ‌లోనే ప‌ట్టాభిపై దాడికి ప్లాన్ చేశాం.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన వైసీపీ ఎమ్మేల్యే

YSRCP: గ‌త కొద్ది రోజులుగా ఏపీలో రాజ‌కీయం చాలా హాట్ హాట్‌గా న‌డుస్తుంది. ఒక‌రిపై ఒక‌రు నిప్పులు చెరుగుగుతున్నారు. బుధవారం నాడు టీడీపీ నేత పట్టాభిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పందించిన లోకేష్‌ ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలకు, ప్రతిపక్ష నేతలకు రక్షణ లేకుండా పోతోందన్నారు. పట్టాభికి హానీ తలపెట్టాలని పోలీసులు చూస్తున్నారని ఆరోపించారు

YSRCP MLA Dwarampudi Chandrasekhar Fires on Pattabhi
YSRCP MLA Dwarampudi Chandrasekhar Fires on Pattabhi

డ్రగ్స్ గుట్టురట్టు చేస్తున్నారనే ఉద్దేశ్యంతోనే పట్టాభి రామ్‌ ని అదుపులోకి తీసుకున్నారని, ఈ విషయం ప్రజలకు కూడా తెలిసిపోయిందని లోకేష్ పేర్కొన్నారు. ఎన్ని దాడులు చేసినా.. ఎంతమందిని అరెస్ట్ చేసినా.. దేశానికే ముప్పుగా పరిణమించిన వైసీపీ డ్రగ్స్ మాఫియా ఆట కట్టించే వరకు టీడీపీ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.

అయితే ప‌ట్టాభి ఇష్యూ ఇప్పుడు అంత‌టా చ‌ర్చ‌నీయాంశంగా మార‌గా, వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పట్టాభిపై కాకినాడలోనే దాడి చేయాలని నిర్ణయించామని.. కానీ తమ అధిష్టానం నుంచి అలాంటివి చేయొద్దని చెప్పడంతో ఆగామన్నారు.

జగన్‌మోహన్‌రెడ్డిని దూషిస్తే, చూస్తూ ఊరుకునేది లేదని.. చంద్రబాబుది దొంగ దీక్ష అని మండిపడ్డారు. చంద్రబాబు దగ్గర బ్రిటిష్‌ వారి లక్షణాలు ఉన్నాయని.. కులాలు, వర్గాలు, గ్రూపులను విడగొడతారన్నారు. సీఎం జగన్‌ను విమర్శించడానికి ఏ కారణం లేక లేనిపోని పదజాలంతో చంద్రబాబు దూషిస్తున్నారని.. అయినా సరే జగన్‌మోహన్‌రెడ్డి పోరాడుతున్నారన్నారు.

పవన్ కళ్యాణ్ జనసేన సింహం అయితే చంద్రబాబు తొత్తుగా మారకుండా రా, సింగిల్‌గా పోటీ చెయ్యాలన్నారు చంద్రశేఖర్ రెడ్డి. ఆయన ఎక్కడ పోటీ చేసినా ఓడించి తీరుతామన్నారు. ప్యాకేజీలకు అలవాటు పడి చంద్రబాబుకు తొత్తుగా మారితే జాతి క్షమించదన్నారు.

రంగా నుంచి రాజకీయాలు నేర్చుకున్నామని.. రంగాను హత్య చేసినప్పుడు కాకినాడలో టీడీపీ నేతల ఆస్తులను తామే ధ్వంసం చేశామన్నారు. కాకినాడలో ఐదు రోజులు కర్ఫ్యూ విధించారని.. రంగాను చంపితేనే తాము ఊరుకోలేదని.. తమ నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డిని తిడితే ఎందుకు ఊరుకుంటామని ప్రశ్నించారు.