మరోసారి ‘‘రంగు పడింది’’.. బర్త్ డే అయినా విడిచిపెట్టని లోకేష్..
Kondala Rao - December 21, 2020 / 05:28 PM IST

ఆంధ్రప్రదేశ్ లో మరోసారి అధికారికంగా రంగు పడింది. గతంలో ఒకసారి గ్రామ సచివాలయాలకు వైఎస్సార్సీపీ రంగులు వేయగా కోర్టు ఆదేశాలతో తొలగించారు. ఇప్పుడు రెండోసారి పోలీసుల వాహనాలకు కూడా అవే రంగులు వేయటం చర్చనీయాంశంగా మారింది. ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం వెంటనే స్పందించింది. ప్రభుత్వ ఆస్తులకు పొలిటికల్ పార్టీ కలర్స్ వేయటం ఏంటని జగన్ సర్కారును నిలదీసింది.
లైవ్ లోకి వచ్చిన లోకేష్..
కొంత మంది పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా మారుతున్నారంటూ మొన్నే ఫైర్ అయిన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈరోజు మళ్లీ లైవ్ లోకి వచ్చారు. పోలీసుల స్కూటర్లకు వైఎస్సార్సీపీ రంగులు వేయటాన్ని తీవ్రంగా ఖండించారు. పాత బండ్లకే కొత్త పెయింట్లు వేసి ‘దిశ’ పేరుతో ఘరానా మోసానికి పాల్పడుతున్నారంటూ ధ్వజమెత్తారు.
పొలిసు వాహనాలకు వైకాపా రంగులా!పైగా పాత వాహనాలకు కొత్తగా రంగులు వేసి దిశ పేరుతో ఘరానా మోసం. కొంత మంది పోలీస్ అధికారుల అత్యుత్సాహం చూస్తుంటే త్వరలో యూనిఫామ్ కూడా వైకాపా రంగులోకి మార్చేసేలా ఉన్నారు.(1/3) pic.twitter.com/m1322e18bV
— Lokesh Nara (@naralokesh) December 21, 2020
యూనిఫాంకి కూడా..
పోలీసు ఆఫీసర్ల అత్యుత్సాహం చూస్తుంటే త్వరలో వాళ్ల యూనిఫాంకి కూడా వైస్సార్సీపీ రంగులు వేసేలా ఉన్నారంటూ లోకేష్ ఎద్దేవా చేశారు. రంగులతో ఆడవాళ్లకు రక్షణ రాదని, మూడు రంగుల మదం(అధికార పార్టీ అండ)తో రోడ్ల మీద పడి మహిళల్ని వేధిస్తున్న మృగాళ్లను శిక్షిస్తేనే స్త్రీలకు మనోధైర్యం వస్తుందని నారా లోకేష్ హితవు పలికారు.
సమయం లేదు మిత్రమా..
పోలీసులు ఈమధ్య ఫ్యాక్ట్ చెక్ పేరుతో టైమ్ వేస్ట్ చేస్తున్నారని, తమ వాహనాలకు వేసింది వైస్సార్సీపీ రంగులు కాదు, అవి శాంతికి చిహ్నాలనే కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారంటూ లోకేష్ విమర్శించారు. ఇలాంటి పనులతో కాలయాపన చేయకుండా మహిళలకు భద్రత కల్పించటంపై ఫోకస్ పెడితే మంచిదని ట్విట్టర్ ద్వారా సూచించారు. దీనికన్నా ముందు మరో ట్వీట్ చేస్తూ జగన్ బర్త్ డే వేడుకలను టార్గెట్ చేశారు.
భజన వద్దు.. రక్షణ ముద్దు..
సీఎం జగన్ పుట్టిన రోజు వేడుకల పేరుతో భజన కార్యక్రమాలను నిర్వహించే బదులు ఆ సమయాన్ని, డబ్బును మహిళల రక్షణకు కేటాయిస్తే బాగుంటుందని నారా లోకేష్ వైఎస్సార్సీపీ నేతలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు సూచించారు. ఒంగోలులో దివ్యాంగురాలు భువనేశ్వరిని సజీవ దహనం చేస్తే స్పందించే మనసు, సమయం ముఖ్యమంత్రి జగన్ కి లేకపోవటం దారుణమంటూ తప్పుపట్టారు.
ఒంగోలులో దివ్యాంగురాలు భువనేశ్వరిని అత్యంత దారుణంగా సజీవ దహనం చేస్తే స్పందించే హృదయం,సమయం ముఖ్యమంత్రి @ysjagan గారికి లేదు.
ఈ ఘటన ద్వారా మహిళల రక్షణ పట్ల ఆయనకు చిత్తశుద్ధి లేదు అనే విషయం మరోసారి బయటపడింది.(1/4) pic.twitter.com/W9DLIQMz7y— Lokesh Nara (@naralokesh) December 21, 2020
గుంటూరు పోలీసుల తీరు గర్హనీయం..
గుంటూరు పోలీసులు పాత వెహికిల్స్ కి కొత్త కలర్స్ వేశారు. అవి కూడా అధికార పార్టీ వైఎస్సార్సీపీ జెండాలోని మూడు రంగులే కావటం గమనార్హం. ఎస్పీ ఈ కార్యక్రమాన్ని ఎంతో అట్టహాసంగా నిర్వహించి దిశ టీమ్స్ కి స్కూటర్లు అందిస్తే తీరా అవి స్టార్ట్ కూడా కావట్లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీసులు అధికార పార్టీ కార్యకర్తల్లా మారారంటూ మాజీ హోం మంత్రి చినరాజప్ప విరుచుకుపడ్డారు.