YS Jagan vs MP : ‘రాజీనామా చేస్తా’.. జగన్ కళ్లముందరే వైసీపీ ఎంపీ బిగ్ ఛాలెంజ్?

YS Jagan vs MP : విశాఖ ఉక్కుని మోడీ సర్కార్ ప్రైవేట్ సంస్థలకు అప్పగించటానికి రంగం సిద్ధం చేయటం ఏపీలో అధికార పార్టీ వైఎస్సార్సీపీని డైలమాలో పడేసింది. వాళ్లు ఈ నిర్ణయాన్ని గట్టిగా వ్యతిరేకించలేక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. హైకమాండుతో మాట్లాడి చెబుతామని లీడర్లు, ప్రభుత్వంతో చర్చించి ప్రకటన చేస్తామని మంత్రులు తూతూమంత్రంగా స్పందిస్తున్నారు. అయితే.. జగన్ పార్టీకే చెందిన వైజాగ్ ఎంపీ మాత్రం దీనికి భిన్నంగా వ్యవహరించటం ఆసక్తికరంగా మారింది.

మడమ తిప్పను..

విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటైజేషన్ చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకునే ప్రసక్తే లేదని, దీన్ని అడ్డుకోవటానికి ఎంతదూరమైనా వెళ్తానని స్థానిక పార్లమెంట్ సభ్యుడు ఎంవీవీ సత్యనారాయణ తేల్చిచెప్పారు. కార్మిక నేతలను వెంట బెట్టుకొని ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని, ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ ని కలిసి తమ నిరసనను తెలియజేస్తామని శుక్రవారం ప్రకటించారు. ఈ కర్మాగారం ప్రభుత్వం చేతుల్లోంచి జారిపోకుండా కాపాడటానికి తన వంతు ప్రయత్నాలన్నీ చేస్తానన్నారు.

చర్చ: YS Jagan vs MP

వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తమ పార్టీ వ్యతిరేకిస్తోందని ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ చెప్పటం విశేషం. వాస్తవానికి ఏపీలోని అధికార పార్టీ ఈ దిశగా ఇప్పటివరకు ఎలాంటి ప్రకటనా చేయలేదు. తన స్టాండేటో స్పష్టంగా చెప్పలేదు. అయినా ఆయన ఇలా స్పందించటం చర్చనీయాంశమవుతోంది. లోకల్ ఎంపీ కాబట్టి ప్రజల భావోద్వేగానికి అనుగుణంగా మాట్లాడి ఉంటాడని కొందరు సమర్థిస్తున్నారు.

స్వయంగా..

కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వెలువడిన వెంటనే స్టీల్ ప్లాంట్ కార్మికులు, ఉద్యోగులు చేపట్టిన ఆందోళన, నిరసన కార్యక్రమాలకు ఎంవీవీ సత్యనారాయణ నిన్న స్వయంగా వెళ్లి సంఘీభావం ప్రకటించారు. కార్మికుల, ఉద్యోగుల, రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజనాల విషయంలో రాజీపడబోమని, అవసరమైతే పదవికి రాజీనామా చేసేందుకు కూడా వెనకాడబోమని ఎంపీ ప్రకటించారు. కేంద్రం తన నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

YS Jagan vs MP : ysrcp mp ready to resign
YS Jagan vs MP : ysrcp mp ready to resign

దీక్ష చేస్తా: YS Jagan vs MP

మోడీ ప్రభుత్వం దిగిరాకపోతే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రవేశ ద్వారం వద్ద నిరవధిక నిరాహార దీక్షకు దిగుతానని సత్యనారాయణ హెచ్చరించారు. ఈ మొత్తం వ్యవహారాన్ని తమ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళతానని, పార్లమెంటులోనూ గళం విప్పుతామని పేర్కొన్నారు. ఎంతో మంది తమ ప్రాణాల్ని పణంగా పెట్టి సాధించిన ఈ కర్మాగారాన్ని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి పోకుండా అడ్డుకుంటామని, వైఎస్సార్సీపీ.. కార్మికుల తరఫున పోరాడుతుందని ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ హామీ ఇచ్చారు.

Advertisement