YS Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను పరిశీలిస్తుంటే ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీని రద్దు చేస్తారేమో అనిపిస్తోంది. జగన్ మనసులో ఈ ఆలోచన ఉందో లేదో తెలియదు గానీ ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీ నాయకుడు దేవినేని ఉమామహేశ్వరరావు మాత్రం ఈ సంచలన ప్రకటన చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికల వ్యవహారం వల్లే జగన్ ఈ కఠిన నిర్ణయం తీసుకోబోతున్నారనే ప్రచారం జరుగుతోంది.
కావాలనే..
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్ కావాలనే కయ్యానికి కాలుదువ్వాడని సీఎం వైఎస్ జగన్ గట్టిగా భావిస్తున్నట్లు తెలుస్తోంది. నిమ్మగడ్డ తన ప్రభుత్వాన్ని సంప్రదించకుండానే స్థానిక సంస్థల ఎన్నికల్ని రద్దు చేశాడని ఆయన గత మార్చి నెలలో ఓపెన్ గానే విమర్శించిన విషయం తెలిసిందే. నిమ్మగడ్డ.. చంద్రబాబు కులపోడని కూడా జగన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అన్ని నిర్ణయాలూ నిమ్మగడ్డే తీసుకుంటే ఇక నేనెందుకు? అసలు.. ముఖ్యమంత్రి జగనా? నిమ్మగడ్డా? అని స్వయంగా సీఎం జగనే మీడియా ముందుకు వచ్చి ఆవేశంగా ప్రశ్నించారు.
తీసేసినా: YS Jagan
సొంతగా పార్టీ పెట్టి, 151 మంది ఎమ్మెల్యేల్ని గెలిపించుకొని సీఎం అయిన వ్యక్తి(వైఎస్ జగన్)కి కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాల విధులేంటో, అధికారాలేంటో తెలియవనుకోవటం తప్పు. తెలుసు. కానీ, రాష్ట్రంలోని కరోనా పరిస్థితులను సాకుగా చూపి స్థానిక సంస్థల ఎన్నికల్ని ఏకపక్షంగా వాయిదా వేశాడనే జగన్ నిమ్మగడ్డపై మండిపడ్డారు. అంతేతప్ప ఎస్ఈసీ పవరేంటో తెలియక కాదు. నిమ్మగడ్డను మధ్యలోనే తొలగించి తమిళనాడు నుంచి జస్టిస్ కనగరాజ్ ను తెచ్చి ఎస్ఈసీ కూర్చీలో కూర్చోబెట్టినా అది కూడా కోర్టులో నిలబడదని తెలుసు.
తలనొప్పులు..
ఎస్ఈసీ కుర్చీ నుంచి నిమ్మగడ్డని తొలగించటం కుదరదని తెలిసినా ఇగో ఫీలింగుతో అతణ్ని కావాలనే ముప్పుతిప్పలు పెట్టాలనే కనగరాజ్ ఎపిసోడ్ కి తెరలేపారు. కొంతవరకు అనుకున్నది సాధించారు. కానీ.. తాను ఇప్పుడే ఎలక్షన్ వద్దని, కనీసం కొవిడ్ వ్యాక్సినేషన్ పూర్తయ్యే వరకైనా వాయిదా వేయించాలని జగన్ అనుకుంటుంటే దానికీ విరుద్ధంగానే నిమ్మగడ్డ చర్యలు చేపట్టారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో పంచాయతీ ఎన్నికలకి తలూపినప్పటికీ జగన్ కి తలనొప్పులు తప్పట్లేదు. ప్రభుత్వంలోని కీలకమైన అధికారులందర్నీ నిమ్మగడ్డ టార్గెట్ చేస్తున్నాడు. చివరికి ప్రవీణ్ ప్రకాశ్ ని, సలహాదారు సజ్జలని కూడా వదలిపెట్టలేదు. దీంతో నిమ్మగడ్డ చర్యల వల్ల సీఎం జగన్ కి చిర్రెత్తుకొస్తోంది. అందుకే కఠిన నిర్ణయానికి మొగ్గుతారేమో అనిపిస్తోంది.

రద్దు చేస్తే: YS Jagan
సీఎం జగన్ ఏపీ అసెంబ్లీని రద్దు చేస్తే మళ్లీ శాసన సభ ఎన్నికలు రావటానికి కనీసం నాలుగైదు నెలల సమయం పడుతుంది. ఈ లోపు నిమ్మగడ్డ ఏం చేసుకున్నా ముఖ్యమంత్రికి సంబంధం ఉండదు. అసెంబ్లీ ఎలక్షన్లు వచ్చేనాటి కల్లా స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయితే ఇక ఎస్ఈసీతో ఏ పంచాయతీ ఉండదు. అసలు నిమ్మగడ్డే అప్పటివరకు ఉండడు. అతని పదవీ కాలం మూర్చితో ముగిసిపోతోంది. కాబట్టి జగన్ శాసన సభను రద్దు చేసే దిశగా ఆలోచించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని పరిశీలకులు పేర్కొంటున్నారు.