YS Jagan vs KCR : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ సీఎం కేసీఆర్ మధ్య ఇప్పటికే మాటల్లేవు. పైగా ఆ జగడం మరింత ముదిరే సూచనలు కనిపిస్తున్నాయి. దీనికి కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్ఎంబీ) ప్రధాన కార్యాలయం మరోసారి కారణం కాబోతోంది. ఈ ఆఫీసును విశాఖపట్నానికి తరలించొద్దని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేఆర్ఎంబీకి లెటర్ రాసిన సంగతి తెలిసిందే.
బేఖాతర్..
తెలంగాణ రాష్ట్ర సర్కారు పంపిన లేఖపై కేఆర్ఎంబీ నుంచి ఇంకా ఎలాంటి జవాబూ రాలేదు. అయినప్పటికీ ఈ లోపే దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన అభిప్రాయాన్ని ఈరోజు (శుక్రవారం) నిర్మోహమాటంగా వ్యక్తం చేసింది. కేఆర్ఎంబీ హెడ్డాఫీసు వైజాగ్ కి వెళ్లటం ఖాయమని, ఇందులో రెండో ఆలోచనే లేదని తేల్చిచెప్పింది. దీంతో ఇరు రాష్ట్రాల మధ్య సంబంధాలు మరింత చెడే ఛాన్స్ ఉందని పరిశీలకులు పేర్కొంటున్నారు.
నేటి భేటీలో: YS Jagan vs KCR
కేఆర్ఎంబీ మెంబర్ సెక్రెటరీ రాయిపురే ఆధ్వర్యంలో ఇవాళ త్రిసభ్య కమిటీ హైదరాబాద్ లోని జలసౌధలో భేటీ అయింది. ఇందులో.. మార్చి దాకా రెండు రాష్ట్రాలకి నీటి కేటాయింపులు, విడుదల వంటి అంశాలపై చర్చించారు. సమావేశంలో ఏపీ నుంచి జల వనరుల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ) నారాయణరెడ్డి, తెలంగాణ నుంచి నాగార్జునసాగర్ ప్రాజెక్టు సీఈ నర్సింహ పాల్గొన్నారు. మీటింగ్ అనంతరం నారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పైన చెప్పిన ప్రకటన చేశారు.
ఏమంటుందో?..
కేఆర్ఎంబీ హెడ్డాఫీసును హైదరాబాద్ నుంచి విజయవాడకి తరలిస్తామంటేనే తాము ఒప్పుకున్నామని, ముందు అలా చెప్పి ఇప్పుడు విశాఖపట్నానికి తరలిస్తామంటే అంగీకరించే ప్రస్తక్తే లేదని తెలంగాణ ఇటీవలే తెగేసి చెప్పింది. వైజాగ్ లో ఏర్పాటు చేస్తామంటే ఓకే చెప్పబోమని, అంతదూరం వెళ్లిరావటం చాలా ఇబ్బందిగా ఉంటుందని, ఖర్చులతో కూడుకున్నదని, ఫలితంగా బోర్డు కార్యకలాపాలకు ఆటంకాలు కలుగుతాయని వివరించింది. ఈ మేరకు తమ అభ్యంతరాన్ని కేఆర్ఎంబీ చైర్మన్ కి రాతపూర్వకంగా విన్నవించింది.

ఇట్లైతే ఎలా: YS Jagan vs KCR
పైన చెప్పిన విషయాలేవీ పట్టించుకోకుండా, కేఆర్ఎంబీ రియాక్షన్ రాకముందే ఏపీ ఏకపక్షంగా ఇలా స్టేట్మెంట్ ఇవ్వటంపై తెలంగాణ ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి. ఈ అంశం బహుశా ఇవాళ్టి మీటింగులో చర్చకు వచ్చి ఉండదని భావిస్తున్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణం, నీటి పంపకాల పంచాయతీ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చాలా కాలంగా మాట్లాడుకోవట్లేదు. ఇప్పుడు కేఆర్ఎంబీ ఇష్యూ ఈ గ్యాప్ ని మరింత పెంచుతుందేమోననే అనుమానం కలుగుతోంది.