జగన్ తీసుకున్న ఈ నిర్ణయంతో కోర్టులతో గొడవెందుకని సర్దుకుపోతున్నట్టే అనుకోవాలా ?
Surya - November 19, 2020 / 03:00 PM IST

వైఎస్ జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇళ్ల స్థలాల పంపిణీ వాయిదాల మీద వాయిదా పడుతున్న సంగతి తెలిసిందే. 30 లక్షల మంది పేదలకు ఉచితంగా భూములిచ్చి అందరి మన్ననలు పొందాలనేది జగన్ ప్లాన్. ఉగాది రోజునే ఈ కార్యక్రమం చేయాలని వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉంది. కోర్టులో అనేక పిటిషన్లు పడ్డాయి. న్యాయస్థానం ఇళ్ల పట్టాల పంపిణీపై స్టే ఇచ్చింది. దీంతో ఎంతో గొప్పగా చేయాలనుకున్న ఇళ్ల పట్టాల పంపిణీ నవ్వులపాలైపోతోంది. పలుసార్లు ఆశజూపి నిరాశ మిగల్చడంతో లబ్ధిదారుల్లో సైతం విసుగొచ్చేసింది. దీంతో జగన్ సర్కార్ కొన్ని సర్దుబాట్లు చేసుకుని ఇళ్ల పట్టాల పంపిణీకి నడుం బిగించింది.

YS Jagan to start land distribution form Christmas
గతంలో అనేకప్రభుత్వాలు ఉచిత ఇళ్ల పట్టాలు ఇచ్చినా ఎవ్వరూ వాటిని అమ్ముకునే హక్కు లబ్దిదారులకు కల్పించలేదు. నిజానికి అది రాజ్యాంగ విరుద్ధం కూడ. కానీ జగన్ మాత్రం ఇచ్చిన స్థలాన్ని విక్రయించుకునే హక్కుని కల్పిస్తానంటూ ముందుకొచ్చారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని కోర్టు స్టే ఇచ్చింది. అలాగే ఇళ్ల స్థలాల సేకరణలో కూడ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. సేకరించిన కొన్ని స్థలాలు ప్రభుత్వం ప్రత్యేక అవసరాల కోసం కేటాయించిన స్ధలాలు. వాటిని పంచిపెట్టడానికి వీల్లేదు. అందుకే సేకరణ మీద కూడ అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ప్రస్తుతం అన్నిటి మీదా కేసులు నడుస్తున్నాయి. అవేవీ ఇప్పట్లో పరిష్కారమయ్యేలా లేవు.

YS Jagan to start land distribution form Christmas
అందుకే జగన్ తానే సర్దుకుని హామీల్లో మార్పులు చేశారు. విక్రయించే హక్కు లేకుండా గత ప్రభుత్వాలు ఇచ్చినట్టే డీ-పట్టాల ద్వారానే స్థలాలను ఇవ్వాలని నిర్ణయించుకుంది. అంటే ఇచ్చిన స్థలాన్ని అనుభవించే హక్కే తప్ప అమ్ముకునే హక్కు లబ్ధిదారునికి ఉండదు. ఇది లబ్దిదారులకు ఒకింత నిరాశే అయినా ఇళ్ల పట్టాలు చేతికొస్తాయి కాబట్టి ఎంతో కొంత తృప్తి చెందుతారనే అంచనా వేసుకున్నారు జగన్. అందుకే క్రిస్మస్ రోజున పట్టాల పంపిణీని ప్రారంభించాలని
ప్రణాళిక వేసుకుంటున్నారు. అలాగే వివాదాల్లో ఉన్న భూములను వదిలేసి మిగతా భూములను పంచాలని భావిస్తున్నారు. మొదటి దఫాలో 15 లక్షల ఇళ్ళు నిర్మించి ఇవ్వాలని చూస్తున్నారు. పట్టాలతో పాటే ఇప్పటికే గత ప్రభుత్వం హయాంలో నిర్మితమైన ఇళ్లకు తుది మెరుగులు దిద్దేసి పంపిణీ చేయాలని కూడ నిర్ణయించుకున్నారు.