ఏకంగా మాజీ ముఖ్యమంత్రి కొడుకునే జగన్ పక్కనపెట్టేశారు
Surya - November 17, 2020 / 05:00 PM IST

2019 ఎన్నికలకు ముందు చాలామంది నేతలు వైసీపీలో చేరారు. వారంతా పదవులు ఆశించి, భవిష్యత్తులో ఏదో అయిపోతామనే ఆశతో జగన్ అండ కోరారు. ఆలా పార్టీలో చేరిన వారిలో చిన్నస్థాయి నేతల నుండి బడా లీడర్ల వరకు ఉన్నారు. బలమైన రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబాల వారసులూ ఉన్నారు. వారిలో నేదురుమల్లి కుటుంబ వారసుడు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కుమారుడు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఒకరు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఒకప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన సతీమణి నేదురుమల్లి రాజ్యలక్ష్మి మంత్రిగా చక్రం తిప్పారు. ఇలా కాంగ్రెస్ పార్టీలో ఉండగా ఒక వెలుగు వెలిగిన నేదురుమల్లి కుటుంబం కాంగ్రెస్ పతనం కావడంతో వెనకబడింది.

YS Jagan neglects former chief ministers son
రాష్ట్రంలోనే కాదు సొంత జిల్లా నెల్లూరు జిల్లాలో కూడ ప్రాభల్యం కోల్పోయింది. నేదురుమల్లి వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన రామ్ కుమార్ రెడ్డి 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. ఆ ఎన్నికల్లో టికెట్ ఆశించిన ఆయనకు నిరాశ ఎదురైంది. తెలుగుదేశం పార్టీ ఎంపీ టికెట్ ఆఫర్ చేసినా వద్దనుకుని వైసీపీలో చేరిన ఆయన చివరకు ఆనం రామనారాయణరెడ్డి గెలుపు కోసం కృషి చేయాల్సి వచ్చింది. ఆ టైంలో జగన్ నుండి ఆయనకు పెద్ద హామీయే వచ్చిందని వార్తలొచ్చాయి. కానీ ఇప్పటివరకు ఆయనకు ఎలాంటి పదవీ, నామినేటెడ్ పోస్ట్ దక్కలేదు. దీంతో ఆయన బాగా డిసప్పాయింట్ అయ్యారట.
కావల్సినంత రాజకీయ నేపథ్యం, పాపులారిటీ, ఆర్ధిక బలం ఉన్నప్పటికీ జిల్లా రాజకీయాల్లో ఏమీ కాకుండా పోయామని బాధ ఆయన్ను వెంటాడుతోందట. ఈ విషయాన్నే ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి వద్ద చెప్పుకుని ఏదో ఒకటి తేల్చమని అడిగారట. సజ్జల సైతం ఈ సంగతిని జగన్ వద్దకు తీసుకెళ్తానని మాటిచ్చారట. మరి వచ్చే ఎన్నికల్లో ఆయనకు ఏదో ఒక దారి దొరుకుతుందేమో చూడాలి. ఇదిలా ఉండగా జిల్లా ప్రజానీకం మాత్రం జగన్ ఏకంగా మాజీ ముఖ్యమంత్రి కుమారుడినే పక్కనపెట్టేశారే అని చెవులు కొరుక్కుంటున్నారు.