YS Jagan: జగన్ కి సీబీఐ కోర్టు నుంచి ఊహించని రియాక్షన్

YS Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నాంపల్లిలోని సీబీఐ కోర్టు నుంచి ఊహించని రియాక్షన్ ఎదురైంది. ఆయన బెయిల్ ని రద్దు చేయాలంటూ వైఎస్సార్సీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలుచేసిన పిటిషన్ కి సంబంధించి ఇవాళ బుధవారం నోటీసులు జారీ చేసింది. ‘‘మీ బెయిల్ ని ఎందుకు రద్దు చేయకూడదో చెప్పండి’’ అంటూ న్యాయస్థానం వివరణ కోరి ఉంటుందని భావిస్తున్నారు. బెయిల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని జగన్ ఉల్లంఘించారని, సాక్షులను ప్రభావితం చేస్తున్నారని, అందువల్ల బెయిల్ ని రద్దు చేసి, ఆయనపైన ఉన్న కేసులను శరవేగంగా విచారణ చేపట్టాలని కోరుతూ రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ ని నిన్న మంగళవారమే విచారణకు స్వీకరించిన సీబీఐ కోర్టు ఒక్క రోజు వ్యవధిలోనే జగన్ కి నోటీసులు ఇవ్వటం గమనార్హం.

10 రోజుల్లో విచారణ..

రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన వ్యాజ్యంపై న్యాయస్థానం వచ్చే నెల (మే) 7వ తేదీని విచారణ చేపట్టనుంది. ఈ లోపు కౌంటర్ దాఖలు చేయాలంటూ జగన్ ని ఆదేశించి ఉండొచ్చు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జగన్ పై సీబీఐ 11 ఛార్జ్ షీట్లను నమోదు చేసినట్లు పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో న్యాయస్థానం జగన్ తో పాటు సీబీఐకి కూడా నోటీసులు ఇచ్చింది. ఈ పరిణామంతో రఘురామకృష్ణరాజు ఖుషీ అయినట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఈయన గతంలో దాఖలుచేసిన వ్యాజ్యాన్ని సాంకేతిక కారణాలతో సీబీఐ కోర్టు విచారణకు స్వీకరించలేదు. కానీ నిన్న మంగళవారం ఆ పిటిషన్ విచారణార్హమేనని పేర్కొంటూ ఇవాళ నోటీసులు ఇవ్వటం ముఖ్య పరిణామమే.

ముందే చెప్పాడు..

తాను దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేసిన తర్వాత సీబీఐ న్యాయస్థానం జగన్ కి, సీబీఐకి నోటీసులు ఇస్తుందని రఘురామకృష్ణరాజు నిన్న మంగళవారమే జోస్యం చెప్పాడు. ఉన్నత పదవుల్లో ఉండేవాళ్లే కోర్టుల తీర్పులను గౌరవించకపోతే సామాన్యులు ఎలా ఇస్తారని ఆయన ఈ సందర్భంగా ప్రశ్నించారు. ఈ ఉద్దేశంతోనే తాను ఈ పోరాటం చేస్తున్నానని చెప్పుకొచ్చాడు. కానీ.. రఘురామకృష్ణరాజు అసలు ఉద్దేశం వేరు. ఆయన రాజకీయ దురుద్దేశంతోనే జగన్ ని టార్గెట్ చేశారని జనం అనుకుంటున్నారు. పొలిటికల్ గా రఘురామకృష్ణరాజును జగన్ పట్టించుకోకపోవటంతో ఆయన బీజేపీతో చేతులు కలిపి ఇలా కోర్టుల్లో పిటిషన్లు వేస్తున్నారని విశ్లేషకులు పేర్కొంటున్నారు. వైఎస్సార్సీపీకి ఎన్నికల సంఘం గుర్తింపును రద్దు చేయాలని కోరుతూ రఘురామకృష్ణరాజు ఢిల్లీ కోర్టులో కేసు వేసిన విషయం విధితమే. అంతేకాదు. రోజూ పనిగట్టుకొని జగన్ ని విమర్శిస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు.

Advertisement