YS Jagan : మాట తప్పం-మడమ తిప్పం అనే డైలాగ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా పాపులర్. ఈ మాటను మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మొట్టమొదటిసారిగా ఎక్కువగా వాడారు. దీంతో ఇది కాస్తా వైఎస్ ఫ్యామిలీకి తిరుగు లేని ‘బ్రాండ్’గా మారిపోయింది. ఎన్నికల్లో బాగా పనిచేసింది. అయితే ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో వైఎస్సార్సీపీ అధినేత, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పునరాలోచనలో పడ్డట్లు, మడమ తిప్పినట్లు కనిపిస్తోంది.
ఎందుకు?..
ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్ కి మధ్య పంచాయతీ ఎన్నికల విషయంలో పచ్చగడ్డి వేసినా భగ్గుమంటోంది కదా. ఈ క్రమంలోనే నిన్న భేటీ అయిన అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ నిమ్మగడ్డకి నోటీసులు పంపటానికి మరో వారం సమయం తీసుకోవటం వైఎస్సార్సీపీ ప్రభుత్వ ఇమేజీకి కొంచెం డ్యామేజీగా భావిస్తున్నారు. ఎస్ఈసీపై చర్యల విషయంలో సీఎం జగన్ మునుపటిలా తొందరపడట్లేదని అర్థమవుతోంది.
కారణం?: YS Jagan
గ్రామ పంచాయతీ ఎన్నికలను ఆపాలని చూడటంతోపాటు నిమ్మగడ్డ రమేష్ కుమార్ విధుల్లో జోక్యం చేసుకోవటం వల్ల జగన్ సర్కార్ కి ఇప్పటికే చాలా సార్లు కోర్టుల్లో ఎదురు దెబ్బలు తగలటం దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. కానీ.. అలాంటిదేం లేదంటూ ప్రివిలేజ్ కమిటీ ఛైర్మన్ కాకాణి గోవర్ధన్ రెడ్డి తోసిపుచ్చుతున్నారు. ఈ దిశగా ముందుకే వెళతాం తప్ప వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తేల్చిచెబుతున్నారు. స్పీకర్ ఇచ్చిన ఫిర్యాదు విచారణకు అర్హమైనదేనని ప్రివిలేజ్ కమిటీ నిర్థారించటమే దీనికి రుజువని వివరిస్తున్నారు.

ఎన్నికలే..
‘‘ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలు ఊపందుకున్నాయి. దీంతో కమిటీ సభ్యులంతా బిజీగా ఉన్నారు. పైగా ఈరోజు వర్చువల్ విధానంలోనే సమావేశమయ్యాం. మరింత లోతుగా, వివరంగా ముఖాముఖి చర్చించటం కోసమే అదనపు సమయం తీసుకున్నాం’ అని కాకాణి గోవర్ధన్ మంగళవారం స్పష్టం చేశారు. మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించారని, వాళ్లపైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎస్ఈసీ నిమ్మగడ్డ రాష్ట్ర గవర్నర్ కి లేఖ రాయటమే కాకుండా దాన్ని బహిర్గతం చేశారు. దీంతో మంత్రులు ఆయనపై శాసన సభ హక్కుల ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలంటూ స్పీకర్ తమ్మినేని సీతారాంకి ఫిర్యాదు చేయటం, స్పీకర్ దాన్ని అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ పంపటం, ఆ కమిటీ నిన్న భేటీ అయి తాజా నిర్ణయం తీసుకోవటం తెలిసిందే.