YS Jagan: ‘‘ఇట్లు.. మీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి’’..

YS Jagan ‘‘ఇట్లు.. మీ..’’ అంటూ ఎండింగ్ ఇచ్చారంటేనే అది లెటర్ అని అర్థం. మరి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు ఎందుకు ఉంది అంటే ఈ లేఖని ఆయనే రాశారు కాబట్టి. ఎవరికి?. తిరుపతి లోక్ సభ నియోజకవర్గ ప్రజలకి. ఎందుకు?. ఈ నెల 17న ఉప ఎన్నిక ఉంది గనుక?. ఏం రాశారు?. తాను అధికారంలోకి వచ్చాక ఈ 21 నెలల్లో ప్రజలకు ఏమేం మేలు చేశానో అందులోనూ అదే పేర్కొన్నారు. ప్రభుత్వం తరఫున రాశారా?. కాదు. తన పార్టీ వైఎస్సార్సీపీ తరఫున. ఎప్పుడు రాశారు?. నిన్న గురువారం. ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం మీద విమర్శలు చేశారా?. లేదు. అసలు ఆ అవసరమే లేదు. మనం కరెక్టుగా పనిచేస్తే చాలు. ఎదుటివాళ్లను తప్పుపట్టడం దేనికి?. మన పనితీరును ప్రజలు గమనిస్తారు. వాటిని చూసే మద్దతిస్తారు. విమర్శలకు ఓట్లు రాలవు. ఈ లేఖలో జగన్ చివరికి ఏం అడిగారు?. తన పార్టీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తికి ఫ్యాన్ గుర్తు పైన ఓటేసి గెలిపించాలని కోరారు.

పథకాలేంటి?.. ప్రయోజనాలేంటి?..

  1. వైఎస్సార్ సున్నావడ్డీ 2. వైఎస్సార్ ఆసరా 3. జగనన్న వసతి దీవెన 4. జగనన్న విద్యా దీవెన 5. వైఎస్సార్ చేయూత 6. వైఎస్సార్ పింఛన్ కానుక 7. జగనన్న అమ్మ ఒడి 8. పేదలకు ఇళ్లు తదితర కార్యక్రమాల ద్వారా విద్య, వైద్యం, వ్యవసాయం వంటి రంగాల్లో పేదలకు ప్రయోజనాలు కలుగుతున్నాయి. రైతులు, అక్కాచెల్లెళ్లు, విద్యార్థులు, వయసు మీద పడ్డోళ్లు.. ఇలా సమాజంలోని దాదాపు అన్ని వర్గాల ప్రజలు లబ్ధి పొందుతున్నారు.

ఇంటింటికీ..

ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతకం చేసిన ఈ లెటర్స్ ని పార్టీ కార్యకర్తలు తిరుపతి లోక్ సభ నియోజకవర్గంలోని ఇంటింటికీ తిరిగి పంచనున్నారు. తద్వారా సీఎం సందేశాన్ని గడపగడపకీ చేరవేస్తారు. దీంతోపాటు ఈ నెల 14న బుధవారం తిరుపతి పరిధిలోని రేణిగుంటలో నిర్వహించే ఎన్నికల బహిరంగ సభలోనూ జగన్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. దీంతో ఈ ఎలక్షన్ లో పోటీచేస్తున్న ప్రధాన రాజకీయ పార్టీల అధ్యక్షులు కూడా ప్రచారంలో పాల్గొన్నట్లవుతుంది.

Advertisement