Vizag: ప్రేమ‌ను నిరాక‌రించింద‌నే క‌క్ష‌.. బ‌హుమ‌తిగా గంజాయి ప్యాకెట్ ఇచ్చిన యువ‌కుడు

Vizag: ప్రేమ ముసుగులో ఎంద‌రో జీవితాలు చిన్నాభిన్నం అవుతున్నాయి. చిన్న వ‌య‌స్సులో కొంద‌రు ప్రాణాలు కోల్పోతుండగా, మ‌రి కొంద‌రు క‌ట‌క‌టాలు పాల‌వుతున్నారు. చిన్న చిన్న కార‌ణాల‌కు క‌క్ష‌లు పెంచుకొని జీవితాల‌ను నాశ‌నం చేసుకుంటున్నారు. తాజాగా ఓ యువ‌కుడు ప్రేమ‌ను నిరాక‌రించింద‌నే కోపంతో గంజాయి ప్యాకెట్ బహుమ‌తిగా ఇచ్చాడు. చివ‌ర‌కు అత‌నే క‌ట‌క‌టాలు పాల‌య్యాడు.

Vizag

వివ‌రాలలోకి వెళితే విశాఖపట్నానికి చెందిన వినయ్ కుమార్ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. తనతో పాటు చదువుకున్న అదే ప్రాంతానికి చెందిన యువతికి ప్రేమిస్తున్నానని చెప్పగా ఆమె నిరాకరించింది. దీంతో కక్ష తీర్చుకోవాలని కుట్ర పన్నాడు. 2018 మే 31న మరో ఇద్దరు స్నేహితురాళ్లతో కలిసి ట్రైన్‌లో సికింద్రాబాద్‌కు బయల్దేరింది.

ఈ విష‌యం తెలుసుకున్న అత‌ను స్నేహానికి గుర్తుగా గిఫ్ట్ అని నమ్మించి 3 కిలోల గంజాయి ప్యాకెట్ ఆమెకు ఇచ్చాడు. మ‌రుసటి రోజు రైలు సికింద్రాబాద్ చేరుకునే ముందే ఆ యువతి గంజాయి స్మగ్లింగ్ చేస్తోందని జీఆర్పీ వారికి సమాచారమిచ్చాడు.

ఈ విష‌యంపై ఆరా తీసిన పోలీసులు గిఫ్ట్ ప్యాకెట్ రూపంలో గంజాయి ఇచ్చి ఆమెను మోసం చేసినట్లు గుర్తించారు. అదేరోజు వినయ్ కుమార్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణలో నేరాన్ని ఒప్పుకున్న అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన‌ట్టు తెలుస్తుంది.

ప్రేమించిన అమ్మాయిని ఇర‌కాటంలో పెట్టాల‌నుకున్న యువ‌కుడు తానే బొక్క బోర్లా ప‌డి క‌ట‌క‌టాలు లెక్కిస్తున్నాడు.ఈ సంఘ‌ట‌న చాలా మందికి ఆద‌ర్శం కావాల‌ని పోలీసులు కోరుతున్నారు.ఇలాంటి త‌ప్పుడు ప‌నులు చేయోద్ద‌ని హెచ్చ‌రిస్తున్నారు.